Minister N. Uttam Kumar Reddy: బీఆర్‌ఎస్‌కు కమీషన్ల కక్కుర్తి!
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:56 AM
తుమ్మిడిహెట్టి వద్ద కాదంటూ మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు. జూరాలలో కాకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారు...
తుమ్మిడిహెట్టిలా జూరాలకూ కేసీఆర్ అన్యాయం
నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలింపు
జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు-రంగారెడ్డి మార్పు
ఈ రెండు ప్రాజెక్టుల్లో కమీషన్లే బీఆర్‌ఎ్‌సకు ప్రామాణికం
రాయలసీమ ఎత్తిపోతలకూ కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం
‘కృష్ణా’ ప్రాజెక్టులను రెండున్నరేళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం
‘ఆంధ్రజ్యోతి’తో నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘తుమ్మిడిహెట్టి వద్ద కాదంటూ మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు. జూరాలలో కాకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారు. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ మోటార్లు, పంపుల్లో కమీషన్లే బీఆర్‌ఎ్‌సకు ప్రామాణికంగా మారాయి’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 100 మీటర్ల ఎత్తులో ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేద ంటూ 100 మీటర్ల దిగువన ఉన్న మేడిగడ్డకు బ్యారేజీని తరలించారని.. అలాగే జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవంటూ 100 మీటర్ల కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మార్చారంటూ ధ్వజమెత్తారు. ఈ రెండింట్లోనూ కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారన్నారు. 2014కు ముందు ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డికి పునర్‌వ్యవస్థీకరణ చట్టం రక్షణ ఉండేదని.. ఈ ప్రాజెక్టును మార్చడం వల్ల రక్షణలు కోల్పోయిందని చెప్పారు. తుమ్మిడిహెట్టి లాగే జూరాలకూ కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఈ అంశంపై ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది.
పాలమూరు-రంగారెడ్డిని 45 టీఎంసీలకే పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ చెబుతోంది?
వాళ్లు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఈ ప్రాజెక్టును 7.15 టీఎంసీలతో తాగునీటి అవసరాలకే కట్టాలని ప్రయత్నిస్తే.. మేం తొలివిడతలో 45 టీఎంసీలు, మలి విడతలో కృష్ణా జలాల పంపిణీ జరిగిన తర్వాత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్ ఘోర తప్పిదాలు చేసింది. మేం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై బీఆర్‌ఎ్‌సకు శ్రద్ధ లేదు. కక్షతోనే నిధులు కేటాయించలేదు.
శ్రీశైలంపై సంపూర్ణ అధికారం ఏపీకి దక్కేలా మీ నిర్ణయాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది?
శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా ఏపీకి కట్టబెట్టాలని నిర్ణయించిందే బీఆర్‌ఎస్. శ్రీశైలం ప్రాజెక్టులో 797 అడుగుల కింది నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం ముందుకు కదిలిందే బీఆర్‌ఎస్ సహకారంతో. జగన్‌తో కుమ్మక్కై శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగించే కుట్రలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరుకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ కేసు వేశాకే ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. జూరాల ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీల నీటిని తరలించి 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా 2013 ఆగస్టు 8న ఉమ్మడి ఏపీలో జీవో ఇచ్చారు. నిజంగా కృష్ణా జలాలను మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డికి తరలించాలనే చిత్తశుద్ధి ఉంటే.. తొలి దశలో జూరాల నుంచి ప్రాజెక్టును చేపట్టి, మలిదశలో శ్రీశైలం నుంచి చేపట్టాల్సి ఉండేది. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయించింది కాంగ్రెస్ పార్టీయే.
జూరాలలో నీటి లభ్యత లేదన్నది వాస్తవమేనా?
అది అవాస్తవం. జూరాల ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణలో ఉంది. ఆ ప్రాజెక్టు నుంచి ఏటా 28 రోజుల పాటు రోజుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటుంది. రోజుకు 2 టీఎంసీల చొప్పున 35 రోజులు పాటు నీటిని తరలించడానికి అవకాశం ఉండేది.
10ు పనులు చేస్తే పాలమూరు-రంగారెడ్డి పూర్తవుతుందని కేసీఆర్ అంటున్నారు?
ఇది పూర్తిగా అబద్ధం. బీఆర్‌ఎస్ దిగిపోవడానికి రెండు నెలల ముందు ఆ పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం 50 శాతం పనులే జరిగాయి. రూ.55086 కోట్లలో రూ.27 వేల కోట్లు వెచ్చిస్తే.. 90 శాతం ఎలా పూర్తయినట్లు? పాలమూరులో డిస్ట్రిబ్యూటరీల కోసం ఎకరా భూమిని కూడా సేకరించ లేదు. భూసేకరణ, పనులు కలుపుకొని పాలమూరు అంచనా వ్యయం రూ.70 వేల కోట్లు దాటుతుంది. పాలమూరు-రంగారెడ్డిలో తట్టెడు మట్టి తీయలేదని కేసీఆర్ చెబుతున్నారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 67 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేశాం. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశాం. 9 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పనులు చేపట్టాం. రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
పథకం పనుల్లో వేగం తగ్గిందా?
మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకున్న సమస్యల్ని గుర్తించి, పరిష్కరించాం. 2021లో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే కాళేశ్వరం అదనపు టీఎంసీ కోసం పాలమూరు పనుల్లో వేగం తగ్గించాలని ఆదేశాలు ఇచ్చారు. పర్యావరణ అనుమతి ముందే తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బీఆర్‌ఎస్ జాప్యం చేసింది. పాలమూరులో ప్రధాన రిజర్వాయరైన నార్లాపూర్ నుంచి ఏదుల లింక్ కెనాల్ పూర్తి చేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక అంచనాలను సవరించి, పనులను ముందుకు నడిపించాం. మూడు నెలల్లో లింక్ కెనాల్ పూర్తి చేస్తాం. కృష్ణా బేసిన్‌లో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు తెలంగాణకు కావాలని అడుగుతున్నాం. గతంలో 299 టీఎంసీలు చాలంటూ బీఆర్‌ఎస్ చేసుకున్న ఒప్పందాన్ని ఏపీ పదేపదే ట్రైబ్యునల్‌లో ప్రస్తావిస్తోంది. ఆ ఒప్పందం తెలంగాణకు మరణశాసనంగా మారింది. కృష్ణా ప్రాజెక్టులను రెండున్నరేళ్లలోపు పూర్తి చేసి తీరడమే మా లక్ష్యం.
‘పోలవరం-బనకచర్ల’పై హరీశ్ కట్టుకథలు: ఉత్తమ్
పోలవరం-బనకచర్లను నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ జనవరి 5న విచారణకు రానుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్లను అడ్డుకోవడానికి నిరంతరం ప్రభుత్వం పోరాటాలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్ ఈ ప్రాజెక్టుపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు పలుమార్లు లేఖలు రాశామని, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), గోదావరి, కృష్ణా బోర్డులకు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందంటూ హరీశ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
కృష్ణా నీటి వినియోగంలో రాజీ పడ్డారన్న ఆరోపణలపై?
ఉమ్మడి ఏపీలో 2004-14 మధ్యకాలంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ అక్రమంగా తరలించిన దానికన్నా 2014-23లో తరలించిందే ఎక్కువ. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను బచావత్ ట్రైబ్యునల్ గంపగుత్తగా కేటాయిస్తే.. రాష్ట్ర విభజన అనంతరం ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఒప్పందం చేసుకోలేదా? ఈ ఒప్పందం 2022 దాకా అమలైంది. తెలంగాణకు ఆ మేరకు నీళ్లు చాలని ఏపీ ట్రైబ్యునల్‌లో వాదిస్తోంది. కృష్ణా నీటి వినియోగంలో బీఆర్‌ఎస్ నిర్ణయాల వల్లే తెలంగాణకు అత్యధిక నష్టం జరిగింది. 2014-15 నుంచి 2023-24 దాకా ఏ సంవత్సరం కూడా జరగనంతా కృష్ణా జలాల వినియోగం 2024-25లో జరిగింది. 286.30 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాం.
ప్రాజెక్టును 45 టీఎంసీలకు పరిమితం చేసేలా లేఖలు రాశారని హరీశ్ విమర్శిస్తున్నారు?
పాలమూరు-రంగారెడ్డికి కేటాయించిన 90 టీఎంసీలపై బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేసి, డీపీఆర్‌ను వెనక్కి పంపింది. మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో పాటు పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవాలని బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన వెసులుబాటులో 45 టీఎంసీలను పాలమూరుకు కేటాయించారు. అందుకే 45 టీఎంసీలతో తొలివిడత అనుమతివ్వాలని, ట్రైబ్యునల్ తీర్పు తర్వాత మరో 45 టీఎంసీలను కేటాయించాలని కోరుతున్నాం.