Housing Minister Ponguleti Srinivas Reddy: ప్రతి కుటుంబానికి ఇల్లు
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:02 AM
ప్రతి కుటుంబానికి వారి ఆదాయ స్థాయి, సామాజిక నేపథ్యం ఎలా ఉన్నా గౌరవప్రదమైన, సురక్షితమైన, స్థిరమైన గృహవసతి కల్పించడమే తెలంగాణ విజన్-2047 లక్ష్యమని....
ఆర్థిక, సామాజిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా అందరికీ.. అదే తెలంగాణ విజన్-2047 లక్ష్యం
భవిష్యత్ పట్టణీకరణ అవసరాలకు అనుగుణంగా విధాన రూపకల్పన
గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబానికి వారి ఆదాయ స్థాయి, సామాజిక నేపథ్యం ఎలా ఉన్నా గౌరవప్రదమైన, సురక్షితమైన, స్థిరమైన గృహవసతి కల్పించడమే తెలంగాణ విజన్-2047 లక్ష్యమని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు.. దానికోసం పెట్టుబడులు’ అంశంపై చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ... ఇందిరమ్మ పథకం కింద 3.5 లక్షల ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయని వివరించారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా మరో లక్ష గృహాలు లబ్ధిదారులకు అందించామని గుర్తు చేశారు. భవిష్యత్ పట్టణీకరణ అవసరాలకు అనుగుణంగా 2047 వరకూ దిశానిర్దేశం చేసే సమగ్ర గృహ విధానం ఆవశ్యకత ఉందన్నారు. ఈ మేరకు తెలంగాణ మోడల్‌ను రూపొందిస్తున్నామని, ఇది గృహ నిర్మాణ కార్యాచరణ మాత్రమే కాకుండా ఆర్థిక, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే విధంగా ఉంటుందన్నారు. ఇది మూడు విధాలుగా ఉంటుందని తెలిపారు. కోర్ అర్బన్ (ప్రధాన పట్టణ ప్రాంతాల) జోన్‌లో మురికివాడల పునర్నిర్మాణం, మిక్స్‌డ్ హౌసింగ్, రెంటల్ హౌసింగ్, బ్రౌన్‌ఫీల్డ్ అభివృద్ధి మీద దృష్టి పెడతామన్నారు. పెరీ-అర్బన్ (పట్టణ శివారు) ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్‌షి్‌పలు, గ్రీన్‌ఫీల్డ్ కాలనీలు, వాక్-టు-వర్క్ ఆధారిత గృహ నమూనాలు అమలు చేస్తామన్నారు. ఈ రెండింటికి వెలుపల ఉండే ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పట్టణాల అభివృద్థిని పరిశ్రమలు, లాజిస్టిక్ కారిడార్‌లు, పారిశ్రామిక వర్క్‌ఫోర్స్ అవసరాలతో అనుసంధానించి కార్మికులకు రెంటల్, వర్కర్ హౌసింగ్ విధానాలు అమలు చేయనున్నట్లు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వివరించారు. ప్రస్తుత సమ్మిట్‌ను చర్చల వరకే పరిమితం చేయకుండా.. విధాన ప్రకటనలు, అమలు మార్గదర్శకాలు, నమూనా ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపుల రూపంలో నేరుగా అమల్లోకి తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. కాగా, ఇదే చర్చలో పలువురు ఇతరులు పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ పీఎ్‌సఎన్ రావు మాట్లాడుతూ లగ్జరీ హౌసింగ్ డిమాండ్ తగ్గుముఖం పట్టిందని, భవిష్యత్తులో డెవలపర్లు చిన్న యూనిట్లు, ఒక్క గది గృహాలు నిర్మించాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి అభిజిత్ శంకర్ మాట్లాడుతూ.. నగర శివార్లలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే ప్రైవేటు రంగం ముందుకువచ్చి నిర్మాణాలు చేపడుతుందని సూచించారు. ఇల్లు కొనుగోలు కోసం ఒక కుటుంబం చెల్లించాల్సిన ఈఎంఐ.. ఆ కుటుంబ ఆదాయంలో 40 శాతంలోపు ఉన్నప్పుడు మాత్రమే అది అందుబాటు ధరలో ఉన్న ఇల్లు అవుతుందని చెప్పారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ జి.రాంరెడ్డి మాట్లాడుతూ.. పీపీపీ మోడల్‌లో ప్రభుత్వం భూములను అందిస్తే.. మధ్యతరగతికి ఇళ్లను నిర్మించడానికి డెవలపర్లు ముందుకొస్తారన్నారు.