Share News

Panchayat Elections: పల్లెపోరు.. నామినేషన్ల జోరు

ABN , Publish Date - Dec 01 , 2025 | 06:10 AM

తెలంగాణ పల్లెపోరులో నామినేషన్ల జోరు కనబడుతోంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాలకు పెద్ద సంఖ్యలో...

Panchayat Elections: పల్లెపోరు.. నామినేషన్ల జోరు
Panchayat Elections

  • తొలి విడతలోని 4,236 సర్పంచ్‌ స్థానాలకు 25,654 నామినేషన్లు

  • 37,440 వార్డు మెంబర్‌ స్థానాలకు 82,276 నామినేషన్లు

  • సర్పంచ్‌కు సగటును ఆరుగురు, వార్డు సభ్యునికి సగటున ఇద్దరు పోటీ

  • నామినేషన్‌ ఉపసంహరణకు 3వ తేదీ తుది గడువు

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పల్లెపోరులో నామినేషన్ల జోరు కనబడుతోంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ఒక్కో సర్పంచ్‌ స్థానానికి సగటును ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. వార్డు సభ్యులను స్థానాలను చూస్తే.. ఒక్కో స్థానానికి సగటున 2.2మంది పోటీలో ఉన్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే 189మండలాల్లోని 4,236 సర్పంచ్‌ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది.

మూడు రోజులు పాటు సాగిన ఈ ప్రక్రియలో ఆయా స్థానాలకు 25,654 మంది నామినేషన్లు సమర్పించారు. తొలి రెండు రోజుల్లో 8,198 మంది నామినేషన్లు వేయగా, చివరి రోజు 17,940మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, తొలి విడతకు సంబంధించి 37.440 వార్డు సభ్యుల స్థానాలకు తొలిరెండు రోజుల్లో 11,680, చివరిరోజు 70,596 మొత్తం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లకు సంబంధించి అన్ని చోట్ల నేడు, రేపు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ఉంటుంది. మూడో తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.


రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

రెండో విడత ఎన్నికల్లో భాగంగా 4,333 సర్పంచ్‌, 33,350వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. మంగళవారం వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం 3న పరిశీలన, 4న వినతుల స్వీకరణ, 5న అప్పీళ్ల పరిశీలన చేపడతారు. ఈనెల 6న ఉపసంహరణ, పోటీలో ఉన్నవారి తుది జాబితాను ప్రకటిస్తారు. 14న పోలింగ్‌ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.


బ్బా..బాబూ.. నీ కాళ్లు మొక్కుతా

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్ని పాట్లైనా పడతారు, ఎన్ని ఫీట్లైనా చేస్తారనేందుకు నిదర్శనం ఈ చిత్రం. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసిన బీజేపీకి చెందిన భూమయ్య.. బ్బా..బాబూ.. నీ కాళ్లు మొక్కుతా నాకు ఓటేయ్యండి అంటూ ఓటర్లను ఇలా ప్రసన్నం చేసుకుంటున్నారు.

- అల్లాదుర్గం


ఈ వార్తలు కూడా చదవండి:

New Liquor Policy: 71,550 కోట్లు

CM Revanth Reddy unveiled the Vision 2047: రేపటి కోసం..

Updated Date - Dec 01 , 2025 | 08:18 AM