Share News

Polavaram Banakacherla: పోలవరం-బనకచర్ల పీఎ్‌ఫఆర్‌ పరిశీలించొద్దు

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:27 AM

పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక పీఎ్‌ఫఆర్‌ను పరిశీలించవద్దని కృష్ణా నది యాజమాన్య బోర్డు...

Polavaram Banakacherla:  పోలవరం-బనకచర్ల పీఎ్‌ఫఆర్‌ పరిశీలించొద్దు

  • కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం - బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్‌)ను పరిశీలించవద్దని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ను తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు సోమవారం లేఖ రాసిన రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ (జనరల్‌) మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకెళుతున్న ఏపీ.. ఇటీవలే డీపీఆర్‌ తయారీకి టెండర్లు కూడా పిలిచారని ఆక్షేపించారు. సీడబ్ల్యూసీ 2010లో జారీ చేసిన మార్గదర్శకాలకు వరద జలాలతో ప్రాజెక్టు ప్రతిపాదించడం వ్యతిరేకమని గుర్తుచేశారు. 75శాతం డిపెండబలిటీ ఆధారంగా ప్రాజెక్టు చేపట్టాలని ప్రణాళికాసంఘం కూడా సిఫారసు చేసిందన్నారు. కృష్ణా బేసిన్‌లో లోటు ఏర్పడటానికి... కృష్ణా నదీ జలాలను ఏపీ సర్కారు ఇతర బేసిన్లకు తరలించడమేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే గోదావరి నీటిని ఏపీ వినియోగిస్తున్నందున.. ఆ నీటిలో వాటాగా కృష్ణా నది నుంచి 64.75 టీఎంసీల వినియోగానికి అవకాశం ఇవ్వాలని కర్ణాటక కోరుతుందని, అదే జరిగితే కృష్ణాలో తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), గోదావరి బోర్డు, కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ నిపుణుల మదింపు కమిటీకూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయని మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ తెలిపారు కనుక ఈ ప్రాజెక్టు పీఎ్‌ఫఆర్‌ను పరిశీలించరాదని, టెండర్‌ప్రక్రియలో ముందుకెళ్లకుండా ఏపీని నిలువరించాలని కోరారు.

Updated Date - Oct 28 , 2025 | 04:27 AM