Polavaram Project: పోలవరం బనకచర్ల’ను పరిశీలించొద్దు
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:06 AM
పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక పీఎ్‌ఫఆర్‌ను పరిశీలించవద్దని కేంద్రాన్ని తెలంగాణ కోరింది..
సీడబ్ల్యూసీ, కృష్ణా, గోదావరి బోర్డులు ప్రాజెక్టు ప్రతిపాదనను తిరస్కరించాయి
కేంద్ర జలశక్తి శాఖకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ
అత్యవసర భేటీ నిర్వహించాలని తెలంగాణ ఈఎన్‌సీ విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్)ను పరిశీలించవద్దని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి, గోదావరి ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు ప్రభావిత రాష్ట్రాలు తిరస్కరించాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-90 (2) ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున.. దీని నిర్మాణం, నిర్వహణ, నీటి వినియోగం అన్నీ కేంద్ర పరిధిలోకి వస్తాయని, ఏపీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని గుర్తు చేశారు. అయినా ఏపీ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలవరం-బనకచర్ల అనుసంఽధాన ప్రాజెక్టును చేపట్టిందని, డీపీఆర్ కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దిశగా ఏపీ ముందుకెళ్లకుండా కట్టడి చేయాల్సింది కేంద్రమేనని స్పష్టం చేశారు. కాగా, గోదావరి ట్రైబ్యునల్ తీర్పు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల అనుసంధానం చేపడుతోందని.. అందువల్ల గోదావరి నదిని పంచుకునే రాష్ట్రాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ మహ్మద్ అంజద్ హుస్సేన్ లేఖ రాశారు. పోలవరం డీపీఆర్‌లో బనకచర్ల అనుసంధానం లేదని, దీనివల్ల పోలవరం ప్రాజె క్టు ఆపరేషన్ ప్రోటోకాల్‌లో మార్పులు జరుగుతాయని ఇదివరకే పీపీఏ లేఖ రాసిందని గుర్తు చేశారు. రాష్ట్రాలు, అన్ని కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పోలవరం-బనకచర్ల అనుసంధానం డీపీఆర్ తయారీ కోసం ఏపీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఆ దిశగా ముందుకెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే సీడబ్ల్యూసీ చైర్మన్‌కు కూడా ఈఎన్‌సీ లేఖ రాసినట్టు వివరించారు.