Share News

Demands Flood Impact Study: పోలవరం విస్తరణ చేపట్టకుండా ఏపీని అడ్డుకోండి

ABN , Publish Date - Nov 08 , 2025 | 02:34 AM

పోలవరం ప్రాజెక్టు విస్తరణ చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. 95వ టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ...

Demands Flood Impact Study: పోలవరం విస్తరణ చేపట్టకుండా ఏపీని అడ్డుకోండి

  • 95వ టీఏసీకి విరుద్ధంగా ప్రతిపాదనలు.. ముంపుపై అధ్యయనం చేయాలి: తెలంగాణ

  • పోలవరం ఎప్పటికి పూర్తిచేస్తారు?: సీడబ్ల్యూసీ

  • 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం: ఏపీ

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు విస్తరణ చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. 95వ టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) అనుమతులను ఉల్లంఘిస్తూ ఏపీ కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తోందని, ఏపీని నిలువరించే బాధ్యత పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)దేనని స్పష్టం చేసింది. పీపీఏ 17వ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌ సీడబ్ల్యూసీలోని కృష్ణా-గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌(కేజీబీవో)లో సీడబ్ల్యూసీ చైర్మన్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ అధ్యక్షతన జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి గౌరవ్‌, ఏపీ నుంచి ఈఎన్‌సీ నర్సింహమూర్తి, తెలంగాణ నుంచి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్‌) మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌, చీఫ్‌ ఇంజనీర్‌(అంతరాష్ట్ర) కె.ప్రసాద్‌, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ ఎస్‌.విజయకుమార్‌, గోదావరి బేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు పలు అంశాలను లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో 8 నదుల ప్రవాహాలు సజావుగా గోదావరిలో కలవలేవని, దీనివల్ల కలిగే ముంపుపై అధ్యయనం చేయాలని రాహుల్‌ బొజ్జా కోరారు. ఇప్పటికే రెండు ఉప నదులపై సర్వే పూర్తయిందని, మరో ఆరు ఉప నదులపై సర్వే జరగాల్సి ఉందని గుర్తు చేశారు. దీనికి అతుల్‌ కుమార్‌ జైన్‌.. ఈ ఏడాది జూలైలోనే సర్వే చేయాలని అనుకున్నామని, జూన్‌లో వరదలు వచ్చినందున చేయలేకపోయామని, వరదలు తగ్గగానే కేజీబీవో ఆధ్వర్యంలో సర్వే చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడం వల్ల కలిగే ముంపుపై ఛత్తీ్‌సగఢ్‌లో సర్వే చేస్తూ తెలంగాణలో మాత్రం ఎందుకు చేయరని రాహుల్‌ బొజ్జా ప్రశ్నించారు. దాంతో.. భద్రాచలంలోని 8 రెగ్యులేటరీలపై కూడా అధ్యయనానికి ఒక కమిటీ వేసేందుకు సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఆమోదం తెలిపారు.


2027 డిసెంబరుకు పూర్తి: ఏపీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పట్లోగా పూర్తి చేస్తారని సీడబ్ల్యూసీ అధికారులు ఏపీని ఆరా తీయగా... 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తిచేసి, సాగు, తాగునీటిని అందిస్తామని ఏపీ అధికారులు తెలిపారు. భూసేకరణ, డయాఫ్రం వాల్‌, రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులన్నీ పూర్తి చేస్తామని, దీని కోసం రూ.20 వేల కోట్ల దాకా అవసరం ఉంటుందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ తరలింపు అంశం చర్చకు రాగా... రెండు దశల్లో రాజమహేంద్రవరానికి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు పీపీఏ తెలిపింది. కానీ.. దాన్ని కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి గౌరవ్‌ తోసిపుచ్చారు. పీపీఏ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి ఒకేసారి తరలించడానికి ప్రతిపాదనలు పంపించాలని తేల్చిచెప్పారు. కాగా.. పీపీఏలో ఏపీ, సీడబ్ల్యూసీ అధికారులు మాత్రమే ఉన్నారని, తెలంగాణ నుంచి ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(డీఈఈ), ఒక అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ)ని డిప్యూటేషన్‌పై నియమించాలని తెలంగాణ ప్రతిపాదించింది. దీనికి పీపీఏ సీఈవో.. ఆన్‌ డిప్యూటేషన్‌ వద్దు, ఆన్‌ డైవర్షన్‌ కింద ఇద్దరినీ నియమించడానికి అనుమతినిస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈఏసీ ఇచ్చిన ఉత్తర్వులపై అబయన్స్‌(ఉత్తర్వులు అమలు కాకుండా నిలుపుదల) గడువు త్వరలో పూర్తికానుందని పీపీఏ అధికారులు గుర్తు చేయగా.. ఆ ఉత్తర్వులు శాశ్వతంగా రద్దు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఏపీ అధికారులు వివరించారు. 95వ టీఏసీ ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేస్తున్నందునే పోలవరం పనుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ గుర్తు చేసింది. ఈ సమావేశానికి వ్యాప్కోస్‌, సీడబ్ల్యూసీ, పీపీఏ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

Updated Date - Nov 08 , 2025 | 02:34 AM