Telangana Unveils Vision: 2047 నాటికి 1,15,000 కిలోమీటర్ల రోడ్లు
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:03 AM
రాష్ట్ర రహదారులను భారీ స్థాయిలో అభివృద్ధి చేయడంతోపాటు ప్రయాణికుల భద్రతకు సంబంధించిన 27 అంశాలు, 44 పేజీలతో కూడిన విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర రోడ్లు....
27 అంశాలతో రోడ్ల పాలసీ
రేపు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో చర్చ
హైదరాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రహదారులను భారీ స్థాయిలో అభివృద్ధి చేయడంతోపాటు ప్రయాణికుల భద్రతకు సంబంధించిన 27 అంశాలు, 44 పేజీలతో కూడిన విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ రహ దారుల విభాగం రూపొందించింది. దీనిని మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు ఆవిష్కరించనున్నారు. అంతకుముందు ఆర్ అండ్ బీ రూపొందించిన ‘రోడ్ సెక్టార్ పాలసీ ఫర్ తెలంగాణ రైజింగ్ విజన్-2047’పై గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలోని మూడోనంబరు హాల్‌లో ఇదే రోజు ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు చర్చ జరగనుంది. తర్వాత రోడ్ సెక్టార్ పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తారు. ఆ పాలసీలో ప్రధానంగా ఉన్న ఏడు మూలస్థంభాల్లో రోడ్డు భద్రతను మెరుగుపర్చడం, గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీ, రహదారుల నిర్మాణాల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం, అన్ని ప్రాంతాలను కలిపేలా రోడ్ల నిర్మాణం సహా పలు అంశాలున్నాయి. దీంతోపాటు రోడ్డు అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నారు. రహదారుల నిర్మాణంలోనూ సాంకేతికత వినియోగం, నిర్మాణ విధానాల్లోనూ పలు మార్పులు చేయనున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కోర్ అర్బన్ రీజియన్, పెరి అర్బన్ అండ్ రూరల్ రీజియన్‌లలో రహదారుల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలో ఉన్న 46వేల కిలోమీటర్ల రహదారి వ్యవస్థను 2034నాటికే 78,411 కి.మీలకు పెంచే లక్ష్యం విధించుకున్నట్టు డాక్యుమెంట్‌లోని యాక్షన్‌ప్లాన్ వివరాల్లో పేర్కొన్నారు. 2047 నాటికి 1,15,000 కిలో మీటర్లకు పెంచేలా ప్రణాళిక రూపొందించారు. రోడ్ల విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర బడ్జెట్‌తో పాటు కేంద్రం నుంచి నిధులు, గ్రాంట్లు, పబ్లిక్-ప్రైవేటు-భాగస్వామ్య విధానంలో నిధులను సమీకరించనున్నారు. కాగా రహదారులను టీజీ రోడ్ సెక్టార్ ప్రాజెక్టు-1 (2026-29), రోడ్ సెక్టార్-2 (2030-34), రోడ్ సెక్టార్-3 (2034-38)గా విభజించారు.