Former RBI Governor Duvvuri Subbarao: తెలంగాణ అన్‌బీటబుల్
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:31 AM
తెలంగాణ ఈజ్ అన్‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, తాను మాత్రం తెలంగాణ అన్‌బీటబుల్ అంటానని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు....
ఏటా 8-9 శాతం స్థిరమైన వృద్ధితోనే 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధ్యం: దువ్వూరి
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఈజ్ అన్‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, తాను మాత్రం తెలంగాణ అన్‌బీటబుల్ అంటానని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. పదేళ్ల తర్వాత ప్రపంచంలో ఎక్కడో ఒకరు ‘మా రాష్ట్రాన్ని తెలంగాణ మోడల్‌లా మార్చాలి’ అని అడుగుతారని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మంగళవారం ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం తెలంగాణ జీఎ్‌సడీపీ సుమారు రూ.16.7లక్షల కోట్లు అంటే సుమారు 250 బిలియన్ డాలర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే వచ్చే 22 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 15 రెట్లు పెంచాలని తెలిపారు. అది జరగాలంటే ప్రతీ ఏటా 8 నుంచి 9 శాతం స్థిరమైన వృద్ధిని సాధించాలని వివరించారు. దక్షిణ కొరియాలోని ‘గ్యోంగ్‌డోంగ్ మోడల్’ లాంటి వేగవంతమైన అభివృద్థిని తెలంగాణ పునరావృతం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో అసాధారణ పురోగతి సాధించిన తెలంగాణ.. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా హైదరాబాద్ నగరాన్ని గొప్పగా చెబుతారని, హైదరాబాద్ భారతదేశ ప్రతిరూపమని చెప్పారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో బలంగా ఉన్న తెలంగాణలో తయారీ రంగం, డిజిటల్, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో విస్తరణ అత్యవసరమని దువ్వూరి అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే విద్య, నైపుణ్యాలే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి స్వల్పకాలిక లక్ష్యాలపై కాక సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ దిశగా అడుగులు వేస్తారని దువ్వూరి ఆశాభావం వ్యక్తం చేశారు.