Licenses and Permits to Be Canceled: ఓవర్‌లోడ్‌తో వెళ్తే డ్రైవింగ్ లైసెన్సు రద్దు
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:04 AM
వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించే భారీ వాహనాల డ్రైవర్లు, యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు....
అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాల పర్మిట్ క్యాన్సిల్
వాహనాల సీజ్.. యజమానులపై కేసు!
పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ
భారీ వాహనాల యజమానులకు జిల్లాలవారీగా అవగాహన కార్యక్రమాలు
245 వాహనాలపై కేసులు.. 180 వాహనాలను సీజ్ చేసిన అధికారులు
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించే భారీ వాహనాల డ్రైవర్లు, యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. చేవెళ్ల సమీపంలో ఇటీవల సంభవించిన టిప్పర్-ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు కంకర లోడ్‌తో వెళుతున్న టిప్పర్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే కారణమని.. ప్రమాద తీవ్రత, మృతుల సంఖ్య పెరగడానికీ టిప్పర్ ఓవర్‌లోడే కారణం అన్న అభిప్రాయాలు విస్తృతంగా వ్యక్తమయ్యాయి. గతంలో జరిగిన ప్రమాదాల్లో చాలామటుకు ఓవర్‌లోడ్ కారణంగానే జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఓవర్‌లోడ్ కారణంగా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల బ్రేకులు పడకపోవడంతో, మలుపుల వద్ద అదుపుతప్పడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకపై ఈ తరహా ఘటనలు తగ్గించేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఓవర్ లోడ్‌తో టిప్పర్లు, లారీలు వెళితే ఆ వాహనాలను సీజ్ చేసి, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడితే వాహన పర్మిట్‌ను కూడా రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఓవర్‌లోడ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డైవర్‌తో పాటు వాహన యజమానిపైనా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలనే అంశాన్ని కూడా రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. భారీ వాహనాల యాజామాన్యాలతో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నారు. త్వరలో మైనింగ్ శాఖ అధికారులతో సమావేశమై వాహనాలకు లోడ్ వేసే రీచ్‌లు, క్వారీల్లోనే ఓవర్ లోడ్ అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో మొత్తం 1.75 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో నిర్మాణ సామగ్రి, సరుకులు తరలించే వాహనాలు 6.65 లక్షలకుపైగా ఉన్నాయి. ప్రమాదాలకు అవకాశం ఉన్న రోడ్లపై భారీ వాహనాలు పరిమిత వేగాన్ని పాటిస్తే, అవి నిర్ణీత లోడుతో ప్రయాణించేలా చర్యలు చేపడితే ప్రమాదాలను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగినా ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందనేది రవాణా శాఖ అధికారుల ఆలోచన.
రవాణా శాఖ అధికారుల అప్రమత్తం
చేవెళ్ల సమీపంలో ఘోర ప్రమాదం తర్వాత రవాణా శాఖ అన్ని జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 245 వాహనాలపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. 180 వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాల్లో 40 ఓవర్ లోడ్‌తో కూడినవి అయితే మిగతావి ఫిట్‌నెస్ రహిత, టాక్స్, పర్మిత్, తదితర పత్రాలు సరిగా లేని వాహనాలు ఉన్నాయి. ‘‘నిబంధనలు అతిక్రమించే వాహనాలపై నిరంతర దాడులు కొనసాగుతున్నాయి. పగటి సమయంతోపాటు రాత్రివేళ తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. సరైన పత్రాలు లేని, ఓవర్‌లోడ్ వాహనాలు రోడ్లపైకి వస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు’’ అని రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి చెందిన ఓ అధికారి తెలిపారు.