Share News

National Water Awards: జల సంరక్షణలో తెలంగాణ టాప్‌!

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:48 AM

జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర జలశక్తి శాఖ 6వ జాతీయ జల అవార్డులు-2024, జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ అవార్డుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.....

National Water Awards: జల సంరక్షణలో తెలంగాణ టాప్‌!

  • జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీలో రాష్ట్రానికి అవార్డుల పంట

న్యూఢిల్లీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర జలశక్తి శాఖ 6వ జాతీయ జల అవార్డులు-2024, జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ అవార్డుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసిన తెలంగాణకు అవార్డుల పంట పండింది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా రాష్ట్ర అధికారులు ఆయా అవార్డులు అందుకున్నారు. జలసంరక్షణలో ప్రజలు, పౌర సంఘాలు, కార్పొరేట్‌ సంస్థలను క్షేత్రస్థాయిలో భాగస్వాములను చేసే లక్ష్యంతో కేంద్రం.. జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించింది. ప్రతి ఒక్కరూ కనీసం 10 వేల కృత్రిమ రీచార్జి, సోర్టేజీల నిర్మాణాలను లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో రూఫ్‌టాప్‌ వాన నీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్థరణ కార్యక్రమాలను చేర్చింది. మొదటి కేటగిరీలో ఎంపికైన వాటికి అవార్డుతోపాటు రూ.2 కోట్లు నగదు బహుమతి, రెండో కేటగిరీ కింద కోటి రూపాయలు, మూడో కేటగిరీకి ఎంపికైతే రూ.25 లక్షలు అందజేసింది. ఇందులో జిల్లాల విభాగంలో కేటగిరీ-1 కింద దక్షిణ జోన్‌ నుంచి మూడు జిల్లాలను ఎంపిక చేయగా ఆ మూడింటిని తెలంగాణ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్‌, నల్లగొండ, మంచిర్యాల జిల్లాలు అత్యుత్తమ ప్రతిభ కనబరచగా.. ఆ జిల్లాలకు అవార్డుతోపాటు రూ.2కోట్లు చొప్పున నగదు బహుమతి దక్కింది.

హైదరాబాద్‌ జలమండలికి రెండో స్థానం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలో చేపట్టిన జలసంరక్షణ చర్యలకు గాను మునిసిపల్‌ కార్పొరేషన్ల విభాగంలో హైదరాబాద్‌ జలమండలి రెండో ర్యాంకు సాధించింది. అవార్డుతోపాటు రూ.2 కోట్ల నగదు బహుమతి సొంతం చేసుకుంది. మునిసిపల్‌ కార్పొరేషన్ల విభాగం కేటగిరీ-2లో వరంగల్‌, నిర్మల్‌, జనగామ జిల్లాలు దక్షిణ జోన్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచి రూ.కోటి చొప్పున బహుమతి గెలుచుకున్నాయి. అలాగే, కేటగిరీ-3లో భద్రాద్రి కొత్తగూడెం మొదటి ర్యాంకు సాధించగా మహబూబ్‌నగర్‌కు మూడో స్థానం దక్కింది. ఈ రెండు జిల్లాలకు చెరో రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి లభించింది. ఇక, అత్యుత్తుమ ప్రతిభ కనబరిచిన నోడల్‌ అధికారులకు ఇచ్చిన అవార్డు.. ఆదిలాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్‌, మెదక్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు నోడల్‌ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఎ.సతీ్‌షను వరించింది. కాగా, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గుమ్మళ్ల సృజన, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై, సీవరేజ్‌ బోర్డ్‌ ఎండీ అశోక్‌ కుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా, నల్లగొండ అడిషనల్‌ కలెక్టర్‌ జే శ్రీనివాస్‌, మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, నిర్మల్‌ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జనగామ కలెక్టర్‌ రిజ్వాన్‌ భాషా షేక్‌, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ జితేష్‌ వీ పాటిల్‌, మహబూబ్‌ నగర్‌ కలెక్టర్‌ విజయేందిర తదితరులు రాష్ట్రపతి చేతులమీదుగా ఆయా అవార్డులు అందుకున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 04:48 AM