Government Schools With Zero Students: ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలుతెలంగాణలోనే అత్యధికం
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:30 AM
ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు వెనకాడుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10.13 లక్షల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే...
సర్కారీ స్కూళ్లల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌వాటిలో 2,081 బడులు తెలంగాణలోనే
నల్లగొండ జిల్లాలోఎక్కువ స్కూళ్లలో ఈ సమస్య: కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 17: ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు వెనకాడుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10.13 లక్షల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, అందులో 5,149 స్కూళ్లు ఒక్క విద్యార్థి కూడా లేక ఖాళీగా ఉన్నాయి. అలాంటి స్కూళ్లలో 70ు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఉన్నాయని లోక్‌సభలో ఎంపీలు కార్తీ చిదంబరం, అమరీందర్ సింగ్ రాజా అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరంలో ఆ 5,149 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వాటిలో.. 2,081 ప్రభుత్వ పాఠశాలలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో ఎక్కువ పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైనట్లు యుడైస్ ప్లస్ డేటా వెల్లడించింది. ఈ జిల్లాలో 315 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇది దేశంలోనే అత్యధికం. మహబూబాబాద్ (167), వరంగల్ (135) జీరో చేరికల పాఠశాలల్లో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈవిషయంలో తెలంగాణ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఉన్న 211 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైంది. దేశంలో కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. పూర్బ మేదినీపూర్ జిల్లా 177 స్కూళ్లతో, దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లా 147 స్కూళ్లతో జీరో ఎన్‌రోల్‌మెంట్‌లో ఆ రాష్ట్రంలో తర్వాత స్థానాల్లో ఉన్నా యి. అలాగే.. 10 కంటే తక్కువ లేదా జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్ల కేటగిరీ సంఖ్య దేశవ్యాప్తంగా రెండేళ్ల కాలంలో 24ు పెరిగింది. ఈ కేటగిరీలో 2022-23లో 52,309 స్కూళ్లు ఉంటే, 2024-25 వి ద్యాసంవత్సరంలో ఆ సంఖ్య 65,054కు చేరింది.
ఖాళీ స్కూళ్లు.. నలుగురికిపైగా టీచర్లు
ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతూ ఉండగా, ఉపాధ్యాయులను మాత్రం ప్రభుత్వాలు భారీగా నియమించాయి. 10 మంది కన్నా తక్కువ విద్యార్థులు లేదా జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దేశవ్యాప్తంగా 2022-23లో 1.26 లక్షల మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వగా, ప్రస్తుతం 1.44 లక్షల మంది టీచర్లు విధుల్లో ఉన్నారు.