New Smart DISCOM: స్మార్ట్ డిస్కమ్!
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:24 AM
రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, వాటికి సంబంధించిన పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌లు)కు స్మార్ట్ మీటర్లు బిగించనుంది. దాంతో ఒక డీటీఆర్ పరిధిలోని వ్యవసాయ పంపుసెట్లు ఏ...
కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్‌లో అన్ని ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లే
డిస్కమ్ పరిధిలోకి వ్యవసాయ, ఎత్తిపోతల, వాటర్‌బోర్డు కనెక్షన్లు
స్మార్ట్ మీటర్లతో పక్కాగా కరెంటు వినియోగం లెక్కలు
డిస్కమ్‌కు 2 వేల మంది సిబ్బంది
లైసెన్స్‌కు ఈఆర్‌సీకి దరఖాస్తు
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, వాటికి సంబంధించిన పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌లు)కు స్మార్ట్ మీటర్లు బిగించనుంది. దాంతో ఒక డీటీఆర్ పరిధిలోని వ్యవసాయ పంపుసెట్లు ఏ మేరకు విద్యుత్ వినియోగిస్తున్నాయనే లెక్కలు కచ్చితంగా రికార్డు కానున్నాయి. దీంతో పాటు వాటర్ బోర్డు, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థకు విద్యుత్ అందించే ఫీడర్లను కూడా భవిష్యత్తులో వేరు చేయనున్నారు. దాంతో కచ్చితమైన కరెంట్ లెక్కలు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కమ్‌లు కూడా పంపిణీ, సరఫరా నష్టాలను వ్యవసాయ కనెక్షన్ల ఖాతాలో వేస్తున్నాయన్న అపవాదు ఉంది. చాలా ఏళ్ల కిందటే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను తొలగించారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయగా... తెలంగాణ వచ్చాకా 24 గంటల పాటు నిరంతరాయ కరెంట్ అందిస్తున్నారు. కాగా, వ్యవసాయ పంపుసెట్లతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల కనెక్షన్లకు విద్యుత్ అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయదలిచిన కొత్త డిస్కమ్ విద్యుత్ వినియోగం పరంగా రాష్ట్రంలో రెండో స్థానంలో, కనెక్షన్ల పరంగా చిన్నదిగా ఉండనుంది. వ్యవసాయ విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు, ఎల్‌టీ లైన్లు అన్నీ ఈ డిస్కమ్‌కు బదలాయించనున్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ కనెక్షన్లు, వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్ వినియోగం 1,38,459 మిలియన్ యూనిట్లుగా లెక్కించారు. దీన్ని బట్టి వినియోగంలో కొత్త డిస్కమ్ వాటా 41 శాతం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్-హైదరాబాద్) 45 శాతం వినియోగంతో అతిపెద్ద డిస్కమ్‌గా, ఉత్తర డిస్కమ్ (ఎన్పీటీసీఎల్-వరంగల్) 14 శాతం వినియోగంతో అతిచిన్న డిస్కమ్‌గా ఉంటాయి. కొత్త డిస్కమ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో త్వరలోనే లైసెన్స్ కోసం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)కి దరఖాస్తు చేసే అవకాశం ఉంది.
కనెక్షన్లన్నీ బదిలీ
ప్రస్తుతం రెండు డిస్కమ్‌ల పరిధిలో ఉన్న వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, వాటర్ బోర్డు కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి.
బకాయిలు.. రుణాలు.. నష్టాలు..
ప్రభుత్వం నుంచి ఆయా కనెక్షన్లకు చెందిన రూ.35,982 కోట్లు రావాల్సి ఉండగా ఆ బకాయిలన్నీ కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. రూ.9,032 కోట్ల రుణాలను కూడా కొత్త డిస్కమ్‌కు ఇవ్వనున్నారు. జెన్‌కో, సింగరేణి వంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పాత డిస్కమ్‌లు రూ.26,950 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ చెల్లింపుల బాధ్యతను కొత్త డిస్కమ్‌పై వేయనున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు)ను కూడా బదలాయించనున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి రెండు డిస్కమ్‌ల నష్టాలు రూ.59,671 కోట్లుగా, జూలై 31 నాటికి అప్పులు రూ.62,897 కోట్లుగా ఉన్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు సబ్సిడీని నేరుగా కొత్త డిస్కమ్ ఖాతాలో జమ చేయనున్నారు.
ఇద్దరు సీఈలు, 2 వేల మంది సిబ్బంది
కొత్త డిస్కమ్‌కు పాలకమండలితో పాటు సీఎండీ, ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు (సీఈలు) ఉంటారు. అలాగే ప్రతీ పాత జిల్లాకు ఒకరు చొప్పున 10మంది ఎస్‌ఈలు, 38 సర్కిళ్లకు ఒక్కో డీఈ, 90 మంది ఏడీఈలు, 520 మంది సబ్ ఇంజనీర్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ ఎం) ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లు 1,000 మంది, పాలన సిబ్బంది 340 మంది కలుపుకొని 2 వేల మందితో కొత్త డిస్కమ్ ఏర్పాటు కానుంది. వీరిని పాత డిస్కమ్‌ల నుంచే సర్దుబాటు చేయనున్నారు.