Minister Uttam Kumar Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడతాం
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:27 AM
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకనుగుణంగాకృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను, నీటి హక్కులను కాపాడతామని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు....
యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిచేస్తాం
ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే 4 లక్షల ఎకరాలకు నీరు: ఉత్తమ్
హుజూర్‌నగర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల ఆకాంక్షలకనుగుణంగాకృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను, నీటి హక్కులను కాపాడతామని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్లపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఫణిగిరి గట్టు రోడ్డు, రాజీవ్ గాంధీ సెంటరు మీదుగా ఎన్‌ఎస్పీ క్యాంపు వరకూ సోమవారం ఉదయం వాకింగ్ చేశారు. ఇందిర సెంటరులో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి టీ సేవించిన ఉత్తమ్ కుమార్.. తదుపరి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ సర్కారు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం.. వారి హయాంలోనే కూలిపోయే దశకు చేరుకుందన్నారు. గుండెకాయ అన్న ‘మేడిగడ్డ’ ఆగిందని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలోని ఎఫ్‌సీఐ గోదాముల్లోని నిల్వ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరానని చెప్పారు. రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు అదనపు గోదాములు నిర్మించాలని కేంద్ర మంత్రికి పలుమార్లు విజ్ఞప్తులు ఇచ్చి లేఖలు పంపామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న ఉత్తమ్.. బీఆర్‌ఎస్ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారి మద్దతుదారులను గెలిపించుకుందన్నారు.