Share News

HPV Vaccine: సర్వైకల్‌ క్యాన్సర్‌పై సర్కారు టీకాస్త్రం

ABN , Publish Date - Dec 24 , 2025 | 06:01 AM

గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సర్కారు దానిపై టీకా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది..

HPV Vaccine: సర్వైకల్‌ క్యాన్సర్‌పై సర్కారు టీకాస్త్రం

  • 1-2 నెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌

  • సిబ్బందికి శిక్షణ పూర్తి.. పద్నాలుగేళ్లు నిండినవారికి సింగిల్‌ డోస్‌

  • ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 55 వేల మంది బాలికల గుర్తింపు

  • పెరుగుతున్న కేసులు.. ఎంఎన్‌జేకు వస్తున్న కేసుల్లో ఎక్కువ అవే

  • వైద్య ఆరోగ్య శాఖ స్ర్కీనింగ్‌లో 20-30ు మందిలో హెచ్‌పీవీ

  • ఆ వైరస్‌ వల్లే చాలా మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సర్కారు దానిపై టీకా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఆ క్యాన్సర్‌కు కారణమై హ్యూమన్‌ పాపిలోమా వైర్‌సను (హెచ్‌పీవీ) నిర్వీర్యం చేసే టీకాను.. 14 ఏళ్లు నిండిన బాలికలకు ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 800కు పైగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఆ వ్యాక్సిన్‌ను 1-2 నెలల్లో అందుబాటులోకి తేనుంది. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 91 యూపీహెచ్‌సీల్లో ఈ టీకాను ఇవ్వనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌ తెలిపారు. ఇందు కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తయిందని.. ఇప్పుడు స్థానిక యూపీహెచ్‌సీ కేంద్రాలసిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించారు. ‘‘శిక్షణ పూర్తి అయిన తర్వాత సిబ్బంది ఇంటింటికీ వెళ్లి.. 14 ఏళ్లు నిండిన బాలికలను గుర్తించి నివేదిక అందజేస్తారు. వారిని యూపీహెచ్‌సీలకు రప్పించి వ్యాక్సిన్‌ వేస్తాం. హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో దాదాపు 55 వేల మంది బాలికలు ఉన్నట్లు అంచనా. 14 ఏళ్లు పూర్తి అయి, 15 ఏళ్ల వయస్సు వరకు ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నాం. ఒకొక్కకరికీ ఒక డోసు మాత్రమే ఇవ్వనున్నాం’’ అని డాక్టర్‌ శ్రీధర్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వయసులో ఉన్న బాలికల సంఖ్య 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంటుందని అంచనా.


వంద మందిలో 40 మంది వారే

హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి ఔట్‌పేషెంట్‌ విభాగానికి రోజూ వంద దాకా కొత్త క్యాన్సర్‌కేఏసులు వస్తుంటే.. అందులో దాదాపు 40ు సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులే ఉంటున్నాయి. అక్కడ ఏటా దాదాపు పది నుంచి పన్నెండు వేల మంది బాధితులకు చికిత్స అందిస్తుండగా.. 13ు మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బాధితులే. ఈ నేపథ్యంలో.. దానికి చెక్‌పెట్టే మార్గం టీకాయేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నిర్దేశిత వయసుల్లో ఈ టీకాలు వేస్తే.. వచ్చే పదేళ్లలో కేసుల సంఖ్య చాలా వరకూ తగ్గిపోతుందని, ఆరు నుంచి పదో తరగిత దాకా చదివే బాలికలను గుర్తించి వారికి వ్యాక్సిన్‌ వేయించాలని వారు సూచిస్తున్నారు.

ముందే గుర్తిస్తే..

మన దేశంలో ఏటా లక్షా ముఫ్పై వేల మంది సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నట్టు అంచనా. అందులో 70 శాతం మంది.. క్యాన్సర్‌ మూడో దశకో, నాలుగో దశకో చేరుకున్న తర్వాతగానీ తాము దాని బారిన పడిన విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అదే ప్రాథమిక దశలో గుర్తిస్తే దాన్ని నయం చేయడానికి 95 శాతం.. రెండో దశలో గుర్తిస్తే 80ు అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అదే మూడో దశలో గుర్తిస్తే నయమయ్యే అవకాశం 40ు, నాలుగో దశలో కేవలం 15ు మాత్రమే ఉంటుందని.. అవగాహన లోపం వల్లే చాలామంది సర్వైకల్‌ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా ఆ మహమ్మారికి అడ్డుకట్ట వేయొచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.

టీకాతో దుష్ప్రభావాలు ఉండవు

హ్యూమన్‌ పాపిలోమా వైర్‌సకు చెక్‌ పెట్టే ఈ వ్యాక్సిన్‌ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండవు. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే సురక్షితమైన లైంగిక బంధాలను కలిగి ఉండాలి. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించాలి.

- డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌, ఇమ్యూనైజేషన్‌ అధికారి, హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

Updated Date - Dec 24 , 2025 | 06:01 AM