Prohibited Lands: ప్రజలకు తెలిసేలా నిషేధిత భూములు
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:29 AM
రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల వివరాలు డిసెంబరు 3వ తేదీ నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నాయి....
వచ్చేనెల 3 నుంచి అందరికీ అందుబాటులో 22ఏ జాబితాలు
ఏర్పాట్లు చేస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. 24నే జాబితాలు పంపిన కలెక్టర్లు
తప్పుల సవరణ పూర్తయిన వెంటనే వెబ్‌సైట్‌లో వివరాలు
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల వివరాలు డిసెంబరు 3వ తేదీ నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబితాల రిజిస్టర్‌ను ఆరోజు నుంచి పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఉన్న 22ఏ జాబితా స్థానంలో తాజాగా రూపొందించిన రికార్డునే ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు ప్రామాణికంగా తీసుకోనున్నారు. వాస్తవానికి సర్కారీ భూములు సంతలోసరుకుగా మారాయి. ప్రభుత్వ, అటవీ, వక్ఫ్, దేవాదాయ, పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం గుర్తించిన భూములను అడ్డదిడ్డంగా అమ్ముకుంటున్నారు. దీనిని అడ్డుకునే వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో క్రయ విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చట్టం-1908 సెక్షన్ 22(ఏ) కింద.. విక్రయించడానికి వీల్లేని భూముల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రెండు నెలల క్రితం ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్లు జాబితాను సిద్ధం చేశారు. అన్ని జిల్లాల నుంచి నిషేధిత భూముల వివరాలను ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా విభజించి రిజిస్ట్రేషన్ శాఖ కోరిన ఫార్మాట్ ప్రకారం పంపారు. ఈ నెల 24 నాటికే జాబితాలు రిజిస్ట్రేషన్ శాఖకు అందాయి. అయితే చాలా చోట్ల తప్పులు దొర్లినట్లు గుర్తించిన కలెక్టర్లు.. మరోసారి సవరణ చేసి తుది జాబితాలను పంపుతామనడంతో మరో అవకాశం ఇచ్చారు. సవరణల అనంతరం ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా నిషేధిత భూముల రికార్డులు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబరు 3 నుంచి ప్రజలు కూడా చూసుకునే వెసులుబాటు కలగనుంది.