Minister Tummala Nageswara Rao: 27,650 టన్నులు
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:56 AM
మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని, గత రెండ్రోజుల్లో 23 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి...
రాష్ట్రానికి నాలుగు రోజుల్లో రానున్న యూరియా
గత 2 రోజుల్లో 23 వేల టన్నుల సరఫరా
రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడేలా వ్యవసాయశాఖకు ప్రత్యేక యాప్: మంత్రి తుమ్మల
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని, గత రెండ్రోజుల్లో 23 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, ఇతర అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. గురువారం ఒక్కరోజే వివిధ కంపెనీల నుంచి 11,930 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని, శనివారం మరో 5,680 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వస్తుందని తెలిపారు. వివిధ కంపెనీల నుంచి 11 రైల్వే రేకుల యూరియా రాష్ట్రానికి ఇప్పటికే తరలిందని, 18 తేదీ నాటికి మరో 11 రైల్వే రేకుల యూరియాకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మిర్యాలగూడ, కరీంనగర్, వరంగల్, పందిళ్లపల్లి, సనత్‌నగర్, నిజామాబాద్ రేక్ పాయింట్లకు చేరగానే... అవసరమున్న జిల్లాలకు సరఫరా చేస్తామని వెల్లడించారు. కాగా తుమ్మలతో ఇక్రిశాట్ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో భేటీ అయ్యారు. చిక్కుళ్లు, తృణధాన్యాలు, మెరుగైన రకాలతోపాటు వివిధ రకాల పంటల్లో తాము అమలుచేస్తున్న వ్యవసాయ సాంకేతిక పద్ధతులను మంత్రికి వివరించారు. ఇక వ్యవసాయశాఖకు ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేసి, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, పంటల యాజమాన్యం, రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. ఏఐ రంగంలో పనిచేస్తున్న సంస్థలతో కలిసి వృద్ధి చేయాలని సూచించారు. సచివాలయంలో నెదర్లాండ్స్‌కు చెందిన ఏఐ కంపెనీల ప్రతినిధులు తుమ్మలను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ప్రత్యేక యాప్ అంశంపై వ్యవసాయశాఖ అదికారులను ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం, విత్తనోత్పత్తిలో సాధించిన ప్రగతిని పరిశీలించటానికి వచ్చిన ఆఫ్రికన్ ప్రతినిధులు, ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ కార్యదర్శి, ఇతర ప్రతినిధులు... రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. దేశంలో ఉత్పత్తి అయ్యే విత్తనాల్లో 60 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నట్లు తుమ్మల వారికి వివరించారు.