Helicopter Tourism: హైదరాబాద్ - సోమశిల - శ్రీశైలం మధ్య హెలీ టూరిజానికి ఏర్పాట్లు: జూపల్లి
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:19 AM
రాష్ట్రంలో హెలీ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించామని, హైదరాబాద్- సోమశిల - శ్రీశైలం మధ్య హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
హైదరాబాద్, కొల్లాపూర్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెలీ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించామని, హైదరాబాద్- సోమశిల - శ్రీశైలం మధ్య హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రూ.68.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్థి పనులకు మంత్రి జూపల్లి శుక్రవారం శ్రీకారం చుట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గం అమరగిరిలో రూ.45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్ రిట్రీట్ నిర్మాణ పనులు, రూ.1.60 కోట్లతో సోమశిల వీఐపీ ఘాట్-బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈజ్ మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల, అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్‌కు హెలీ టూరిజం నిర్వహణ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.