Share News

Primary Agricultural Cooperative Societies: సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలక మండళ్లు!

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:56 AM

రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎ్‌స)కు ఎన్నికలు నిర్వహించరా? వ్యవసాయ మార్కెట్‌ కమిటీల తరహాలో పీఏసీఎ్‌సలకూ నామినేటెడ్‌ పాలక మండళ్లు ఏర్పాటు చేస్తారా.....

Primary Agricultural Cooperative Societies: సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలక మండళ్లు!

  • ఇక ఎన్నికలు నిర్వహించకూడదని సర్కారు నిర్ణయం?

  • వ్యవసాయ మార్కెట్‌ కమిటీల తరహాలో నియామకాలు

  • సొసైటీల్లో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే అవకాశం

  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 3 డైరెక్టర్‌ పోస్టులు తప్పనిసరి

  • చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ సహా 13 మందితో పాలకవర్గం

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎ్‌స)కు ఎన్నికలు నిర్వహించరా? వ్యవసాయ మార్కెట్‌ కమిటీల తరహాలో పీఏసీఎ్‌సలకూ నామినేటెడ్‌ పాలక మండళ్లు ఏర్పాటు చేస్తారా? ఈ మేరకు రేవంత్‌ సర్కారు నిర్ణయం తీసుకుందా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాత కమిటీలను చేసిందని చెబుతున్నాయి. వీలైనంత త్వరలో పీఏసీఎ్‌సలకు పాలక వర్గాలు ఏర్పాటు చేయాలని, సంక్రాంతిలోపు ప్రక్రియ పూర్తిచేయాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సహకార ఎన్నికలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మొదలుకొని చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌, చైర్మన్‌, డీసీఎంఎస్‌, టెస్కాబ్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ ఎన్నిక వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. రాజకీయ పార్టీల పోటీ, డబ్బు ఖర్చు, డైరెక్టర్లతో క్యాంపులు, ఫిరాయింపులు.. ఇలా అనేక చిత్రాలు చోటుచేసుకుంటాయి. పాలక వర్గాల ఏర్పాట్లన్నీ నువ్వా? నేనా? అన్నట్లు చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా సహకార ఎన్నికలు జరుగుతాయి. గ్రామాల్లో రైతుల మధ్య వైషమ్యాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎ్‌సలకు ఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగా లేదు. నామినేటెడ్‌ పద్ధతిలోనే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సహకార చట్టం ప్రకారం.. ప్రతి సొసైటీకి 13 మందితో పాలక వర్గం ఏర్పాటు చేయాలి. ఇందులో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్ల నియామకంలో రిజర్వేషన్లు కూడా పాటిస్తారు. ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్‌, బీసీ జనరల్‌ కేటగిరీలకు మూడు డైరెక్టర్‌ పోస్టులు ఇస్తారు. మిగిలిన 10 మంది డైరెక్టర్లను జనరల్‌ కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎంఎస్‌), రాష్ట్ర స్థాయిలో మార్క్‌ఫెడ్‌, టెస్కాబ్‌ పాలక వర్గాలను ఇదే తరహాలో నియమించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. అయితే పీఏసీఎ్‌సల్లో సభ్యులుగా ఉన్న వారితో మాత్రమే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని, సభ్యత్వం లేని వారికి అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.


వ్యవసాయ మార్కెట్‌ కమిటీల తరహాలోనే..

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల పాలక వర్గాలను నామినేటెడ్‌ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రజాప్రతినిధులే మార్కెట్‌ కమిటీలకు ప్రతిపాదనలు ఇస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితానే రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి పరిగణనలోకి తీసుకొని కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే అవకాశం కల్పిస్తారు. ఆయా మండలాలు, నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవులు నామినేషన్‌ పద్ధతిలో ఇస్తారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి, వచ్చినా ఓడిపోయిన వారికి, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉండే వారికి, సామాజిక వర్గాల సమీకరణలను పాటిస్తూ మార్కెట్‌ కమిటీ పాలక వర్గాల్లో అవకాశం కల్పిస్తారు. ఇదే పద్ధతిలో పీఏసీఎ్‌సలకూ పాలక వర్గాలను నామినేట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సిఫారసు మేరకు పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు.

100 శాతం అధికార పార్టీ కార్యకర్తలకే..

ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీ అభ్యర్థులైనా గెలిచే అవకాశం ఉంటుంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఎక్కువ పీఏసీఎ్‌సలు వస్తాయి. అయితే, ఎన్నికల నిర్వహణ తదితర ఖర్చులన్నీ తడిసి మోపెడవుతాయని, నామినేషన్‌ పద్ధతిలో నియామకాలు చేస్తే ఏ గొడవా ఉండదనే ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రక్రియతో 100 శాతం పోస్టులు అధికార పార్టీ కార్యకర్తలకే వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 207 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉండగా.. 24 మార్కెట్లు మినహా 183 మార్కెట్‌ కమిటీలకు పాలక వర్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి మార్కెట్‌ కమిటీకి 18 మందితో పాలక వర్గం ఉంటుంది. ఇందులో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, 10 మంది డైరెక్టర్లు, ఇద్దరు ట్రేడర్లు, నలుగురు ఎక్స్‌-అఫీషియో సభ్యులు ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 3,294 మందికి అవకాశాలు వచ్చాయి. ట్రేడర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులను మినహాయిస్తే సుమారు 3 వేల మంది అధికార కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు పదవులు లభించాయి. ఇదే తరహాలో పీఏసీఎ్‌సలు, డీసీసీబీలు, మార్క్‌ఫెడ్‌, టెస్కాబ్‌లకు కూడా పాలక వర్గాలు ఏర్పాటు చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది అధికార పార్టీ కార్యకర్తలకు అవకాశాలు వస్తాయి. పీఏసీఎస్‌ పాలకవర్గ కూర్పు 13 మందితో ఉంటుంది. ఇందులో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరి నుంచే డీసీసీబీ- డీసీఎంఎస్‌ డైరెక్టర్లు, మార్క్‌ఫెడ్‌- టెస్కాబ్‌ డైరెక్టర్లు, చైర్మన్లు నియమితులవుతారు.

Updated Date - Dec 23 , 2025 | 03:56 AM