Telangana Rising Global Summit: ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2025
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:50 AM
భారత్ ప్యూచర్ సిటీ త్వరలో అంతర్జాతీయ వేదిక కానుంది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వచ్చే...
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహణ
‘ప్రజాపాలన-విజయోత్సవాల’ పేరిట సంబరాలు
మీర్‌ఖాన్‌పేటలో 100 ఎకరాల్లో ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): భారత్ ప్యూచర్ సిటీ త్వరలో అంతర్జాతీయ వేదిక కానుంది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వచ్చే నెల 8, 9 తేదీల్లో ఇక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతుండటంతో పాటు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల పేరిట ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో తెలంగాణ విజన్ రైజింగ్-2047 డాక్యుమెంట్‌తో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేయనున్నారు. అలాగే వివిధ రంగాలకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త పాలసీలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు రానుండడంతో ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్‌ఖాన్‌పేటలో 100 ఎకరాలను సిద్ధం చేశారు. వీటిని చదును చేసే పనులు మొదలయ్యాయి. పనుల పరిశీలనకు త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడకు రానున్నట్లు సమాచారం. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఫార్చ్యూన్-500 కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఫార్మా, ఇతర రంగాలకు సంబంధించిన పెట్టుబడులే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజెంటేషన్లు రెండు రోజుల పాటు ఇవ్వనున్నారు.
జయేశ్ రంజన్ అధ్యక్షతన కోర్ కమిటీ
సదస్సు నిర్వహణ కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధ్యక్షతన ఏడుగురు ఉన్నతాధికారులతో సమన్వయ కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికా్‌సరాజ్, సంజయ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఎ్‌సపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, టీజీఐఐసీ ఎండీ శశాంక్, ఎంఆర్‌డీసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి కమిటీలో ఉన్నారు. అలాగే సీనియర్ ఐఏఎ్‌సలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిపి27 మందితో 9 ఆర్గనైజేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. వేదిక-ఏరినా డిజైన్ కమిటీ, ఆహ్వాన కమిటీ, ప్రోగ్రామ్ డిజైన్-కోఆర్డినేషన్ కమిటీ, ఒప్పందాల కమిటీ, ఆతిథ్యం-లాజిస్టిక్ కమిటీ, ఫుడ్ అండ్ కల్చరల్ కమిటీ, డిజిటల్ మార్కెటింగ్ అండ్ మీడియా కమిటీ, కంటెంట్ క్రియేషన్ అండ్ ఐఈసీ కమిటీ, సెక్యూరిటీ అండ్ ప్రొటోకాల్ కమిటీలను ఏర్పాటు చేశారు.