Telangana Land Rates: భూముల విలువల మదింపు పూర్తి
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:01 AM
భూముల మార్కెట్ విలువలను తొలుత కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఓఆర్‌ఆర్ లోపల పెంచాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు...
ప్రస్తుత విలువపై 2.5 రెట్ల మేర పెంచాలని అధికారుల ప్రతిపాదన.. మార్కెట్ విలువలో 60ు దాటకుండా పెంపు
స్థానిక ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): భూముల మార్కెట్ విలువలను తొలుత కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో (ఓఆర్‌ఆర్ లోపల) పెంచాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇదే ప్రాతిపదికన మార్కెట్ విలువల సవరణ చేపట్టారు. తరువాత రాష్ట్రమంతా ఒకేసారి మార్కెట్ విలువల సవరణ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ మేరకు ఇటీవల తుది ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు స్వల్ప మార్పులతో వాటికి ఆమోదం లభించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక.. 2014 నుంచి 2021 వరకూ భూముల విలువలు పెంచలేదు. 2021లో నాటి ప్రభుత్వం తొలిసారి అప్పటి విలువలను 20ు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022లో మరోసారి 33ు పెంచింది. నాలుగేళ్ల తరువాత మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువల సవరణకు ప్రభుత్వం సన్నద్ధమైంది.
ఇవీ ప్రతిపాదనలు..
భూముల విలువలకు సంబంధించి ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు.. అసమతుల్యంగా ఉన్న విలువలను హేతుబద్ధీకరించడంతోపాటు, కొన్నిచోట్ల ఇప్పుడున్న విలువను 2.5 రెట్ల మేర పెంచేందుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్లో ఎకరా ధర రూ. 5 కోట్లు ఉంటే.. అలాంటి చోట్ల కనీసం రూ.3 కోట్ల వరకు పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఇక అత్యధికంగా ఆదాయాన్ని తీసుకొచ్చే కోర్ అర్బన్ పరిధిలో ఇప్పుడున్న మార్కెట్ విలువలను పెంచనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో గచ్చిబౌలిలో అపార్ట్‌మెంట్లకు సంబంధించి చదరపు అడుగు ధర ప్రస్తుతం రూ.3000 ఉంది. దీన్ని కనీసం 60 శాతం వరకు (రూ.1800 దాకా) పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ లెక్కన చదరపు అడుగు రూ.4800 వరకు అవుతుంది. 2022లలో గచ్చిబౌలిలో ప్రధాన రహదారిమీద ఉండే వాణిజ్య భవనాల్లో చదరపు అడుగుకు గ్రౌండ్ ఫ్లోర్‌లో రూ.7300, మొదటి అంతస్తు అయితే రూ.6600, ఇతర అంతస్తులకు రూ.6600 చొప్పున నిర్ణయించారు.
ప్రస్తుతం ఈ ధరలను 25 నుంచి 30 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించారు. హఫీజ్ పేటలో ప్రస్తుతం ఖాళీ స్థలం (ఇంటి స్థలం) గజం రూ.26,700గా ఉంది. కానీ, బహిరంగ మార్కెట్లో ఈ ధర ఆరు రెట్లుకుపైగా ఉంది. ఇలాంటి చోట్ల కనీసం రెండున్నర రెట్లు పెంచాలని ప్రతిపాదించారు. ఇదే ప్రాంతంలో వాణిజ్య స్థలం అయితే గజం రూ.44,900 ఉంది. కొండాపూర్‌లోనూ నివాస, వాణిజ్య స్థలాల మార్కెట్ విలువలు ఇదే విధంగా ఉన్నాయి. వాణిజ్య స్థలాల విలువలను ఇప్పుడున్న విలువపై 25 శాతం దాకా పెంచాలని నిర్ణయించారు. నార్సింగ్‌లో గజం రూ.23,800, మణికొండలో రూ.23,900, రాయదుర్గంలో రూ.44,900, బుద్వేల్‌లో నివాసస్థలం గజం రూ.10,200, వాణిజ్య స్థలం రూ.26,700 ఉంది. ఇటీవల ఈ ప్రాంతంలో ఎకరా రూ.20 కోట్లు పలికింది. మహేశ్వరంలో పుస్తక విలువలు గజం రూ.2100, వాణిజ్య స్థలం రూ.10,200 చొప్పున ఉన్నాయి. అయితే మహేశ్వరం లాంటి చోట్ల రూ.2100 ఉన్న విలువను కనీసం రూ.3800 నుంచి రూ.4500 వరకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.