Share News

Police Constable Vacancies: కొత్త సంవత్సరంలో.. పోలీసు కొలువులు

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:26 AM

తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీసు శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్‌ రెడ్డి స్పష్టం చేశారు..

Police Constable Vacancies: కొత్త సంవత్సరంలో.. పోలీసు కొలువులు

  • 14 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

  • త్వరలో నోటిఫికేషన్‌ విడుదల.. రెండేళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు

  • ఖాళీగా వేలాది కానిస్టేబుల్‌ పోస్టులు.. సిబ్బందిపై పెరిగిన పని భారం

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీసు శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్‌ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్‌ కానిస్టేబుళ్లతో పాటు ఇతర యూనిఫామ్‌ సర్వీసుల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే పోలీసు రిక్రూట్‌మెంట్లు జరిగాయి. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. 2023 నుంచి ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో జాప్యం అవుతోన్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంద న్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీసు శాఖలో ఏటా జరుగుతున్న పదవీ విరమణల వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుళ్ల భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. మిగిలిన సిబ్బందిపై పనిభారం ఎక్కువ అవుతోంది. ఈపోస్టులను రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్‌ అవుతుందని, ఆలస్యం అయ్యేకొద్దీ మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Dec 31 , 2025 | 05:26 AM