Share News

Damodara Rajanarsimha: జిల్లా కేంద్రాల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:36 AM

సర్కారు దవాఖానాల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ.....

Damodara Rajanarsimha: జిల్లా కేంద్రాల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు

  • ఎంజీఎం, రిమ్స్‌లోనూ రిట్రైవల్‌ సెంటర్లు.. దాతల కుటుంబాలకు అండగా ఉందాం

  • కార్పొరేట్‌ ఆస్పత్రులపై నిఘా పెట్టాలి

  • అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సర్కారు దవాఖానాల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రస్తుతం నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఈ చికిత్సలు ఆదిలాబాద్‌ రిమ్స్‌, వరంగల్‌ ఎంజీఎంలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీటితోపాటు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అవయవ పునరుద్ధరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఇందుకోసం సీనియర్‌ డాక్టర్లతో డెడికేటెడ్‌ బృందాలు ఏర్పాటు చేయాలని, ఒక్కో అవయవానికి సంబంధించి ఒక్కో టీమ్‌ ఉండాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తుకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రోత్సహించేలా ఈ బృందాలు పనిచేయాలన్నారు. బుధవారం జీవన్‌దాన్‌ పనితీరు, ప్రభుత్వ దవాఖానాల్లో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి దామోదర సమావేశం నిర్వహించారు. ఇటీవల కేంద్ర చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకున్నందున.. అందుకనుగుణంగా రూపొందించాల్సిన కొత్త నిబంధనలపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టం ప్రకారం సొంత కుటుంబ సభ్యులతోపాటు గ్రాండ్‌ పేరెంట్స్‌ కూడా అవయవాలు దానం చేసేందుకు, స్వీకరించేందుకు అర్హులేనన్న నిబంధనను అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో ‘తోటా’ చట్టం ప్రకారం పరస్పర అవయవ మార్పిడికి కూడా అవకాశం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీవన్‌దాన్‌ కోఆర్డినేటర్‌, డాక్టర్‌ భూషణ్‌రాజుకు సూచించారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల సహకారం తీసుకోవాలన్నారు. అవయవ దాతల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. బ్రెయిన్‌ డెడ్‌ అయినవారి అవయవాలను ఇతరులకు దానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలను అందరూ అభినందించాలన్నారు. అవయవ దాతల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్లలో జరుగుతున్న అవయవ మార్పిడి సర్జరీలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

Updated Date - Sep 11 , 2025 | 05:36 AM