Share News

Deputy CM Bhatti Vikramarka: నేడు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:44 AM

మహిళా స్వయం సహాయక బృందాలకు మంగళవారం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

Deputy CM Bhatti Vikramarka: నేడు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

  • ఒకేసారి రూ.304 కోట్ల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి

  • రూ.3,500 కోట్ల వడ్డీని ఎగ్గొట్టిన బీఆర్‌ఎస్‌: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళా స్వయం సహాయక బృందాలకు మంగళవారం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి భట్టి.. ములుగు జిల్లా ఏటూరునాగారం నుంచి మంత్రి సీతక్క పాల్గొన్నారు. మొత్తం 3,57,098 సంఘాలకు ఒకేసారి రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ఈ రుణాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు హాజరయయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని గాలికొదిలేసిందని భట్టి ఆరోపించారు. ఇప్పటికే తాము రాష్ట్రంలో మూడు దఫాలుగా వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని తెలిపారు.

గత సర్కారు నిధులను కాజేసింది: సీతక్క

ఏటా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తూ, ప్రభుత్వం తరఫునే వడ్డీలను చెల్లిస్తున్నామని సీతక్క వివరించారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు మహిళా సంఘాలకు చెల్లించాల్సిన రూ.3,500 కోట్ల వడ్డీ సొమ్మును ఎగవేసిందని, సంఘాల అభయహస్తం నిధులను కూడా కాజేసిందని ఆరోపించారు.

Updated Date - Nov 25 , 2025 | 04:44 AM