Minister Sridhar Babu: నియోజకవర్గానికో ఎంఎ్‌సఎంఈ పార్కు!
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:54 AM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎ్‌సఎంఈ పార్కును అభివృద్ధి చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు....
మహిళల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తాం.. మహిళా సాధికారత ఇంటి నుంచే మొదలవ్వాలి
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎ్‌సఎంఈ పార్కును అభివృద్ధి చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. అది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. మహిళా సాధికారతే తమ లక్ష్యమని, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యసాధనలో మహిళలను కీలక భాగస్వాములుగా చేస్తామన్నారు. ‘వీ హబ్’ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘వీ-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుక’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారత పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలంటే మార్పు ఇంటి నుంచే మొదలు కావాలన్నారు. తెలంగాణలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతం అని, ఇది జాతీయ సగటు 45.2 కంటే ఎక్కువగా ఉండడం రాష్ట్ర ప్రగతికి ప్రతిబింబమని తెలిపారు. మహిళలు కూడా వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించగలరని ‘వీ హబ్’ నిరూపించిందన్నారు. ఈ స్ఫూర్తితో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించే అంకుర సంస్థలను అంతర్జాతీయ స్థాయి వ్యాపార సంస్థలుగా మార్చేలా ‘వీ హబ్ 2.0’కు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మహిళల ఆలోచనా తీరులోనూ మార్పు రావాలన్నారు. ఉద్యోగాలు సృష్టించేలా కొత్తగా ఆలోచించాలని సూచించారు.
రాష్ట్రంలో ‘అదితి’కి ఆతిథ్యం
లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు నూతన ఆవిష్కరణలనుతీసుకొచ్చే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకమైన ‘అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లి్‌షమెంట్(అదితి)’కి పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పారు. దీపి ద్వారా ప్రయోజనం పొందే మొదటి క్లస్టర్లలో ఒకటిగా మెదక్ జిల్లాలోని ఫార్మా పరిశ్రమను ఎంచుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి బీఈఈ కృతజ్ఞతలు తెలిపిందన్నారు. అదితి పథకాన్ని ప్రోత్సహించడంపై విద్యుత్తు శాఖ పరిధిలోని బీఈఈ, ఈఈఎ్‌సఎల్ మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి రూపొందించిన ప్రత్యేక నివేదికను మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదితి పథకం ఎంఎ్‌సఎంఈలకు ఒక వరమని ప్రశంసించారు. అదితి అమలులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.