Share News

Hybrid Annuity Mode: తేలిన హ్యామ్‌ రోడ్ల లెక్క!

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:29 AM

రోడ్లు, భవనాల శాఖలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌)లో అభివృద్ధి చేయడానికి తలపెట్టిన రహదారుల లెక్క తేలింది..

Hybrid Annuity Mode: తేలిన హ్యామ్‌ రోడ్ల లెక్క!

  • 5,526 కి.మీ మేర అభివృద్ధి

  • ఇందుకు రూ.10,646 కోట్లు అవసరం

  • గతంతో పోల్చితే పెరిగిన 4,168 కోట్లు

  • కొత్తగా 43 కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లు

  • ఉమ్మడి జిల్లాల వారీగా జాబితా సిద్ధం

  • నేడో, రేపో హ్యామ్‌ రోడ్లపై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌)లో అభివృద్ధి చేయడానికి తలపెట్టిన రహదారుల లెక్క తేలింది. ఈ మేరకు గతంలో ఖరారు చేసిన పలు రోడ్లలో అధికారులు మార్పులు చేసి హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల వారీగా తుది జాబితాను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 401 పనులకు సంబంధించి 5,526.92 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు రూ.10,646.59 కోట్ల నిధులు అవసరపడతాయని తేల్చారు. ఇందులో రెండులేన్ల రోడ్ల పనులు 862కి.మీ మేర, రెండులేన్లు ప్లస్‌ పేవ్‌డ్‌ షోల్డర్స్‌ పనులు 663 కి.మీ మేర, 4లేన్ల రోడ్లు 135 కి.మీ మేర, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు 43 కి.మీ మేర అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఉన్నతీకరణ కింద సింగిల్‌లేన్‌ రోడ్డు 780 కి.మీ మేర, రెండు వరుసల రోడ్లు 2,657 కి.మీ మేర, రెండులేన్లు ప్లస్‌ పేవ్‌డ్‌ షోల్డర్స్‌ 143 కి.మీ మేర, 4లేన్ల రోడ్డు 220 కి.మీ మేర చేపట్టాలని నిర్ణయించారు. గతంలో హ్యామ్‌ కింద 373 పనులకు సంబంధించి 5,190 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేయాలని.. ఇందుకు రూ.6,478 కోట్లు అవసరమవుతాయని తేల్చారు. తాజాగా సవరించిన లెక్కల ప్రకారం గతంలో కన్నా 28 పనులు, అభివృద్ధి చేయాల్సిన రోడ్లు 336 కి.మీ మేర పెరిగాయి. ఈ మేరకు గతంలో కన్నా రూ. 4,168 కోట్ల నిధులు పెరిగాయి. గతంలో చేసిన ప్రతిపాదనల్లో గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లు లేవు. తాజా ప్రతిపాదనల్లో 43 కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లుగా అభివృద్ధి చేయాలని పొందుపర్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా జాబితాను పరిశీలిస్తే అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 765.57 కి.మీ మేర 62 పనులకు సంబంధించి రూ.1245.41 కోట్లు అవసరపడతాయని ప్రతిపాదించారు. తాజాగా తేలిన హ్యామ్‌ రోడ్లు, నిధులకు సంబంధించిన అంశాలపై శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడోరేపో సమీక్ష నిర్వహించనున్నారు.


60శాతం రుణాల రూపంలో..

హ్యామ్‌ నిబంధనల ప్రకారం మొత్తంగా రూ.10,646.59 కోట్లలో 40 శాతం అంటే రూ.4,260 కోట్లను ప్రభుత్వం తొలుత కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం అంటే రూ.6,390 కోట్లను కాంట్రాక్టర్లు రుణాల రూపంలో సేకరించాల్సి ఉంటుంది. అయితే అసలు చిక్కుముడి ఇక్కడే ఉంది. కాంట్రాక్టర్లు 60శాతం నిధులను బ్యాంకుల నుంచి తీసుకున్న తర్వాత కొంతకాలానికి ప్రభుత్వం బ్యాంకులకు సమయానికి చెల్లింపులు చేయకపోతే బ్యాంకులు తమ రేటింగ్స్‌ తగ్గిస్తాయని, దీనిపై స్పష్టతనివ్వాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. రుణం ఇచ్చే అంశం కూడా పనులు దక్కించుకున్న కంపెనీ రేటింగ్స్‌ని బట్టే ఉంటాయని, బ్యాంకు నిబంధనలకు తగ్గట్టుగా లేకపోతే ఇవ్వలేమని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. దీంతోపాటు ఒక రోడ్డు విస్తరణ పని పూర్తయ్యాక దాని నిర్వహణ, బ్యాంకులో తీసుకున్న రుణం, వడ్డీ కలిపి ప్రభుత్వం 15ఏళ్లలో ఎంత చొప్పున చెల్లిస్తుందన్న విషయాలపై స్పష్టతనివ్వాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నారు. వీటిపై సమీక్ష అనంతరం మంత్రి స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

Updated Date - Sep 10 , 2025 | 04:29 AM