Bhatti Vikramarka: 5,586 కి.మీ రోడ్ల అభివృద్ధి
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:38 AM
రోడ్లు, భవనాల శాఖలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన రహదారుల లెక్కలు ఎట్టకేలకు తేలాయి...
తొలి దశలో 10,986 కోట్లతో పనులు
హ్యామ్‌లో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ
మూడేళ్లలో అద్దంలా రోడ్లు: కోమటిరెడ్డి
ట్రాఫిక్ సర్వే ప్రకారమే హ్యామ్ రోడ్లు: భట్టి
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే రెండుసార్లు మార్పులు చేసినా, అడుగుపడలేదు. గురువారం ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో హ్యామ్ రోడ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సర్వే ప్రకారం అవసరమైన చోట రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. దాని ప్రకారమే జాబితాను సిద్ధం చేశామని అధికారులు తెలపడంతో గురువారం ఆ జాబితాకు ఆమోదముద్ర పడింది. ఫలితంగా రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలో మొదటి దశలో రూ.10,986 కోట్లతో, 5,587 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో ఒకటి, రెండు వరుసల రోడ్లు దాదాపు 3,792 కి.మీ ఉండగా.. వాటి కోసం రూ.4,416 కోట్లు, అలాగే మరో 1,795 కి.మీ మేర రోడ్లను రూ.6,569 కోట్లతో వెడల్పు చేయనున్నారు. వీటి ద్వారా మండల కేంద్రాల నుంచి జిల్లాలకు రెండు వరుసలు, జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి 4 వరుసల రోడ్లను నిర్మించనున్నారు. హ్యామ్ విధానంలో రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ పట్టనుందని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని రోడ్లను అద్దంలా తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. మండలం, నియోజకవర్గ కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు రోడ్ల కారిడార్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి దశ హ్యామ్ పనులకు నవంబరు, డిసెంబరులో టెండర్లను ఆహ్వానిస్తామని తెలిపారు. హ్యామ్ విధానంలో చేపట్టే రోడ్ల పనులను ఆయా రహదారులపై ట్రాఫిక్ సర్వేలను దృష్టిలో పెట్టుకుని చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రోడ్ల నిర్మాణ పనులను దశల వారీగా చేపట్టి, పూర్తిచేయాలన్నారు.
10,986 కోట్లలో 40శాతం ప్రభుత్వ వాటా
ఆర్ అండ్ బీలో ప్రతిపాదనల మేరకు హ్యామ్ రోడ్ల నిర్మాణానికి రూ.10,986 కోట్ల వరకు ఖర్చవుతుందని తేలడంతో.. హ్యామ్ నిబంధనల ప్రకారం మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వమే తొలుత గుత్తేదారులకు అందించాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం నిధులను గుత్తేదారులు రుణాల రూపంలో సేకరించాలి. పనుల టెండర్లను రెండు నెలల్లో ఆహ్వానించేలా ఆర్ అండ్ బీ అధికారులు కసరత్తు ప్రారంభించారు.