Election Commission CEC Janesh Kumar: తదుపరి ఎస్‌ఐఆర్ తెలంగాణలోనే
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:19 AM
మూడో విడతలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంటుందని భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్...
రాష్ట్రంలో ఈ ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎస్‌ఐఆర్ అవసరం
రాష్ట్రంలో ప్రతి బీఎల్‌వోకు 930 మంది ఓటర్లు
భారత ఎన్నికల వ్యవస్థకు బీఎల్‌వోలే వెన్నెముక
ఓటు హక్కు వినియోగంపై పట్టణ ఓటర్ల నిరాసక్తి
గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు
బూత్ స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మూడో విడతలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంటుందని భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ప్రకటించారు. బిహార్‌లో విజయవంతంగా పూర్తయిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకుని, దేశానికే మార్గదర్శకంగా నిలిచేలా నిర్వహించాలని సూచించారు. ఆదివారం ఇక్కడ రవీంద్ర భారతిలో రాష్ట్రంలోని వెయ్యి మంది బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌వోలు), ఎన్నికల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మూడో విడత ఎస్‌ఐఆర్ ఎప్పుడు చేపట్టేది ఆయన స్పష్టంగా వెల్లడించకపోయినప్పటికీ మరో మూడు నెలల తర్వాత మొదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ బిహార్‌లో నిర్వహించిన భారీ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తయిందన్నారు. ఆ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, రీపోలింగ్, రీకౌంటింగ్ అవసరం లేకపోవడం విశేషమన్నారు. తెలంగాణలో ఒక బీఎల్‌వో పరిధిలో 930 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఎస్‌ఐఆర్ సమయంలో ఓటర్ల జాబితాల్లోని చనిపోయినవారి పేర్లు, డబుల్ ఓట్లు వంటి లోపాలు బయటపడతాయన్నారు. వాటిని సరిచేయడానికి ఎస్‌ఐఆర్ అవసరమని వివరించారు. భారత రాజ్యాంగానికి అతిపెద్ద సైనికులు బీఎల్‌వోలేనని.. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ కొనసాగుతోందని, భవిష్యత్తులో మిగతా రాష్ట్రాల్లో కూడా చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ను అందరం కలిసి విజయవంతం చేద్దామని బీఎల్‌వోలకు పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌తో ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం కొత్త శకంలోకి అడుగుపెడుతుందని చెప్పారు. భారత ఎన్నికల వ్యవస్థకు బీఎల్‌వోలే వెన్నెముక అని, వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా ప్రక్షాళనలో విజయం ఆధారపడి ఉంటుందన్నారు. కెనడా దేశం కంటే రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత బీఎల్‌వోలపైనే ఉందని తెలిపారు.
పట్టణ ఓటర్లలో నిరాసక్తి
దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓటింగ్ జరుగుతుంటే.. పట్టణాల్లో మాత్రం తక్కువగా ఉంటోందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని వారికి ఓటు వేయడంపై ఉన్న నిరాసక్తే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. దీన్ని అధిగమించేందుకు ఎన్నికల విభాగాలు మరింత చైతన్యం తీసుకురావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ఉత్సాహంగా క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటూ దేశానికి దారి చూపుతున్నారని కొనియాడారు. దేశంలో ఎన్నికలను చట్టబద్ధంగా పక్కాగా నిర్వహిస్తున్నామని, ఎన్నికల చట్టాలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని సీఈసీ స్పష్టంచేశారు. భారత ప్రజాస్వామ్య విస్తృతిని ప్రస్తావిస్తూ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్ రెడ్డి, అదనపు సీఈవో వాసం వెంకటేశ్వరరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, సీనియర్ డిప్యూటీ సీఈసీ పవన్ కుమార్‌శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.