Agriculture Minister Tummala Nageswara Rao: మొంథా బాధితులను ఆదుకుంటాం
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:05 AM
పంట నష్టపోయిన రైతులతోపాటు మొంథా తుపాను బాధితులందరినీ ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు...
కేంద్రం సహకరించకున్నా ఎకరాకు రూ.10 వేల పరిహారం
ఖమ్మం మున్నేరు ప్రాంతంలో మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంట నష్టపోయిన రైతులతోపాటు మొంథా తుపాను బాధితులందరినీ ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గత వరదల సమయంలో కేంద్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని, ఇప్పుడూ సహకరించకున్నా.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం అందిస్తామని తెలిపారు. ఖమ్మంలోని మున్నేరు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం పర్యటించిన తుమ్మల.. వరద ముంపు పరిస్థితిని తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలైన బొక్కలగడ్డ, పద్మావతినగర్ తదితర కాలనీలను పరిశీలించారు. నయాబజార్ పాఠశాలలోని పునరావాస కేంద్రానికెళ్లి వరద బాధితులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ గోడు వెల్లబోసుకున్న బాధితులకు అండగా ఉంటామని.. ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. వరదల ప్రభావాన్ని అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్, కరీంనగర్, హనుమకొండ, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని తుమ్మల వెల్లడించారు.