State Heritage Day: డిసెంబరు 9.. రాష్ట్రానికి పర్వదినం
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:28 AM
తెలంగాణ రాష్ట్రం ఉన్నంతవరకు డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.....
రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ తల్లి అవతరణ, సోనియా జన్మ దినోత్సవం జరుపుకుంటాం
ఇచ్చిన మాటకు కట్టుబడిన గొప్ప నాయకురాలు సోనియా: రేవంత్
వర్చువల్‌గా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
తెలంగాణ ప్రదాత సోనియా: మహేశ్
హైదరాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఉన్నంతవరకు డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో సోనియా గాంధీ స్ఫూర్తి, మన్మోహన్ సింగ్ విజన్‌ను ప్రస్ఫుటంగా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను మంగళవారం ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి సీఎం వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డిసెంబరు 9, 2009న యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారంటూ అప్పటి హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ తీసుకున్న నిర్ణయం, ప్రకటన ఈ ప్రాంత ప్రజలకు సంతోషం ఇవ్వడమే కాకుండా ఆత్మగౌరవాన్నీ నిలబెట్టిందన్నారు. డిసెంబరు 9కి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రజా ప్రభుత్వం.. ఆ పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.సోనియా గాంధీ జన్మదినం కూడా డిసెంబరు 9 కావడం సంతోషం కలిగించే విషయమన్నారు. గత ఏడాది డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించి పరిపాలనలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఏడాది అన్ని కలెక్టరేట్లలోనూ తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకున్నామన్నారు. దినచర్య ప్రారంభం కాగానే తెలంగాణ తల్లి ఆశీర్వాదం, స్ఫూర్తినీ తీసుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముందుకు వెళ్లాలన్నదే సంకల్పమని తెలిపారు. కరీంనగర్ గడ్డపై 2004లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడిన సోనియా గాంధీ ఎన్ని ఒడిదుడుకులు, అవాంతరాలు ఎదురైనా అధిగమించి రాష్ట్ర ఏర్పాటులో సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పాటు కల నిజమైన తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
కాగా, సోనియా గాంధీ పట్టుదల, కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆనాడు ఆమె తలుచుకోకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేదే కాదన్నారు. గాంధీ భవన్‌లో మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మహేశ్ గౌడ్ భారీ కేక్‌ను కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి.. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని కొనియాడారు. యూపీఏ చైర్‌పర్సన్ హోదాలో ఆమె మెజారిటీ ఎంపీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేశారన్నారు. తెలంగాణ యువత ఆత్మబలిదానాలతో చలించిన ఆమె.. సమస్యను అర్థం చేసుకుని రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. కాగా, సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వినోద్‌కుమార్ తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి చీరలు, బెడ్‌షీట్లు పంపిణీ చేశారు.
బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్: మహేశ్‌గౌడ్
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయిందని, ఆ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. వాస్తవ పరిస్థితులు తెలిసే కేసీఆర్ బయటకు రావట్లేదని చెప్పారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఊహించని విధంగా పెట్టుబడులు రావడం శుభపరిణామమని అన్నారు. కాగా, జిల్లా కాంగ్రెస్ కమిటీల (డీసీసీలు) కొత్త అధ్యక్షులు 6 నెలల్లో తమను తాము నిరూపించుకోవాలన్నారు. డీసీసీ అధ్యక్షులు, అనుంధ సంఘాల చైర్మన్లతో జూమ్ ద్వారా సమావేశమమైన ఆయన.. జిల్లాల్లో అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు.