Share News

Telangana to Become IT and Pharma Hub: రాష్ట్రాన్ని ఐటీ, ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:50 AM

తెలంగాణను భవిష్యత్‌లో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రాన్ని ఐటీ, ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి....

Telangana to Become IT and Pharma Hub: రాష్ట్రాన్ని ఐటీ, ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతాం

  • ఆర్‌ఆర్‌ఆర్‌తో పారిశ్రామికవృద్ధి: మంత్రి కోమటిరెడ్డి

  • వైద్యరంగంలో ఫార్మాసిస్టులది కీలక పాత్ర: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను భవిష్యత్‌లో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రాన్ని ఐటీ, ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమిని (1974-2025) గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు, కాకతీయ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతా్‌పరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఫార్మసీ వృత్తి సమాజం పట్ల, పరిశోధన, నూతన ఆవిష్కరణలకు మధ్య వారధిగా పనిచేస్తోందన్నారు. గతంలో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ వలన ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు రీజనల్‌ రింగు రోడ్డుతో పారిశ్రామిక వృద్ధికి మరింత బాటలు పడుతాయని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. వైద్యరంగంలో ఫార్మాసిస్టుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. ఫార్మాసిస్టులు నాణ్యమైన మందులను తయారు చేస్తూ రాబోయే కాలానికి దిక్సూచిగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణను ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చాలన్నదే సంకల్పమని, వరంగల్‌, నల్లగొండలోనూ టీ-హబ్‌ తరహాలో ఇంక్యూబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 03:50 AM