Share News

Minister Siddharth Babu: దేశ ఏరో ఇంజన్‌ రాజధానిగా తెలంగాణ

ABN , Publish Date - Nov 16 , 2025 | 07:26 AM

రాబోయే ఐదేళ్లలో 2030 నాటికి తెలంగాణను దేశ ‘ఏరో ఇంజన్‌ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Minister Siddharth Babu: దేశ ఏరో ఇంజన్‌ రాజధానిగా తెలంగాణ

  • ‘ఏరో స్పేస్‌, డిఫెన్స్‌ ఎకోసిస్టమ్‌’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

  • 2023-24లో రాష్ట్ర ఏరోస్పేస్‌ ఎగుమతుల విలువ 15,900 కోట్లు

  • 2024-25లో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్ల ఎగుమతులు

  • ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రాబోయే ఐదేళ్లలో 2030 నాటికి తెలంగాణను దేశ ‘ఏరో ఇంజన్‌ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ‘ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ ఎకోసిస్టమ్‌’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ వ్యూహాత్మక డిఫెన్స్‌ హబ్‌గా మార్చాయన్నారు. శనివారం ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎ్‌సబీ)లో ఆ సంస్థతో పాటు డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ, ముంజాల్‌ గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ‘విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఆత్మనిర్భర భారత్‌’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో వేగవంతమైన వృద్ధిని అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ఏడాది దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటిందన్నారు. ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి రేటు నమోదైందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో ఈ రంగానికి చెందిన 25కు పైగా అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు, 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ఏరోస్పేస్‌ ఎగుమతుల విలువ 2023-24లో రూ.15,900 కోట్లు కాగా 2024-25లో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. ఆదిభట్లలో రూ.425 కోట్ల పెట్టుబడితో ‘టాటా-సాఫ్రాన్‌’ ఏర్పాటైందన్నారు. త్వరలో రూ.800 కోట్లతో జేఎ్‌సడబ్ల్యూ డిఫెన్స్‌ యూఏవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌, రూ.500 కోట్లతో ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ డిఫెన్స్‌ యూనిట్‌ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో యువతకు విమానయాన, రక్షణ రంగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించే పలు కోర్సులు ఉన్నాయన్నారు. హీరో ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ కాంత్‌ ముంజాల్‌, ఐఎ్‌సబీ డీన్‌ ప్రొఫెసర్‌ పీ మదన్‌, ప్రొఫెసర్‌ చందన్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 07:28 AM