Share News

State Rapid Loan: అప్పుడే 45,900 కోట్లు

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:46 AM

రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేగం పెరిగింది. ఆరు నెలల్లోనే రూ.45,900 కోట్లు రుణాలు సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం....

State Rapid Loan: అప్పుడే 45,900 కోట్లు

  • అనుమతించిన అప్పుల్లో ఆరు నెలల్లోనే 85 శాతం సేకరించిన రాష్ట్ర సర్కారు

  • తొలి నాలుగు నెలల్లో రూ.25,900 కోట్లు

  • తాజాగా 5 వేల కోట్లు.. దీంతో కలిపి ఈ నెలలో ఇప్పటికే 12 వేల కోట్లు సేకరణ

  • 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్రం అనుమతించిన మొత్తం అప్పు రూ.54,009 కోట్లు

  • ఇక వచ్చే 6 నెలల్లో దొరికే రుణం రూ.8,109 కోట్లే!

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేగం పెరిగింది. ఆరు నెలల్లోనే రూ.45,900 కోట్లు రుణాలు సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మొత్తం అప్పుల్లో ఇది 85శాతం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.64,539 కోట్ల మేర మార్కెట్‌ రుణాలు తీసుకోవాలని భావించింది. కానీ పలు పరిమితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రూ.54,009 కోట్ల రుణాలు తీసుకునేందుకే అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ నాటికే అందులో రూ.45,900 కోట్లు అప్పు తీసుకుంది. అంటే ఆరు నెలల్లోనే 85శాతం అప్పు చేసింది. అందులోనూ ఈ ఒక్క నెలలోనే రూ.12 వేల కోట్లు రుణం తీసుకోవడం గమనార్హం. కొత్త ఆదాయ మార్గాలు లేకపోవడం, పథకాలు, అభివృద్ధి పనులకు నిధులను సర్దాల్సి రావడంతో త్వరత్వరగా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం రుణ సేకరణ చేస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

నెల నెలా భారీగా పెరుగుతూ..

రాష్ట్ర ప్రభుత్వం గతంలో రిజర్వు బ్యాంకు ప్రతి వారం నిర్వహించే ఈ-వేలం ద్వారా రూ.1,000 కోట్ల నుంచి రూ.2,000 వరకు రుణాలు తీసుకునేది. కానీ కొన్ని నెలలుగా ప్రతి దఫా ఏకంగా ఐదారు వేల కోట్ల వరకు అప్పు తీసుకుంటోంది. మంగళవారం కూడా ఏకంగా రూ.5000 కోట్ల అప్పు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశీలిస్తే.. ఏప్రిల్‌లో రూ.4,400 కోట్లు, మే నెలలో రూ.4,500 కోట్లు, జూన్‌లో రూ.8,500 కోట్లు, జూలైలో రూ.8,500 కోట్లు కలిపి నాలుగు నెలల్లో రూ.25,900 కోట్లు అప్పు చేసింది. ఆగస్టులో రూ.8,000 కోట్లు, ఈ నెల 2న రూ.6 వేల కోట్లు, 16న వెయ్యి కోట్లు, తాజాగా మంగళవారం మరో రూ.5 వేల కోట్లు రుణాలు తీసుకుంది. అంటే ఈ రెండు నెలల్లోనే రూ.20 వేల కోట్లు అప్పు చేసింది. దీనితో మొత్తం అప్పులు రూ.45,900 కోట్లకు చేరాయి. కేంద్రం అనుమతించిన రూ.54,009 కోట్ల మార్కెట్‌ రుణాల్లో ఇవి 85శాతంకావడం ఆందోళనకరం. అంతేకాదు మిగిలిన ఆరు నెలల్లో తీసుకోగలిగిన రుణం రూ.8,109 కోట్లు మాత్రమే. ఇతర మార్గాల్లో ఆదాయం సమకూరకుంటే ప్రభుత్వానికి ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


దీర్ఘకాలిక అప్పుల కింద రూ.5,000 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రిజర్వు బ్యాంకు ఈ వేలం ద్వారా 7.44శాతం వార్షిక వడ్డీతో రూ.5,000 కోట్లు అప్పు తీసుకుంది. ఇందులో 22 ఏళ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్లు, 23 ఏళ్లతో రూ.1,000 కోట్లు, 24 ఏళ్లతో రూ.1,000 కోట్లు, 26 ఏళ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్ల రుణం ఉన్నాయి. మంగళవారం తెలంగాణ సహా 11 రాష్ట్రాలు రూ.25 వేల కోట్ల అప్పులు తీసుకున్నాయి.

Updated Date - Sep 24 , 2025 | 03:46 AM