Share News

State Expenditure: 5 నెలల్లో రాష్ట్ర ఖర్చు 88,610 కోట్లు

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:41 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలు ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.88,610.95 కోట్లు వ్యయం చేసింది. అదే సమయంలో...

State Expenditure: 5 నెలల్లో రాష్ట్ర ఖర్చు 88,610 కోట్లు

  • అన్ని రకాల రాబడుల కింద వచ్చిన ఆదాయం రూ.96,654 కోట్లు

  • ఇందులో రుణాల సేకరణతో సమకూరింది రూ.33,415 కోట్లు

  • కేంద్ర గ్రాంట్ల అంచనాలో ఇప్పటివరకు వచ్చింది 7.35శాతమే!

  • ‘కాగ్‌’ నివేదికలో వెల్లడి.. 6 నెలల్లోనే 85ు అప్పులు చేసిన సర్కారు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలు ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.88,610.95 కోట్లు వ్యయం చేసింది. అదే సమయంలో రుణ సేకరణ సహా అన్ని రకాల రాబడుల కింద రూ.96,654.24 కోట్లు సమకూరాయి. మంగళవారం కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,63,486.74 కోట్లు వ్యయం అవుతుందని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేయగా.. అందులో ఐదు నెలల్లో రూ.88,610.95 కోట్లు (33.63ు) ఖర్చు చేసినట్టు తెలిపింది. ఇందులో పథకాల కోసం రూ.27,488 కోట్లు, వడ్డీ చెల్లింపుల కింద రూ.11,447 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.20,141 కోట్లు, పెన్షన్లకు రూ.7,701 కోట్లు, సబ్సిడీలకు రూ.7,492 కోట్లను వ్యయం చేసిందని వెల్లడించింది. రాష్ట్ర సర్కారు మౌలిక సదుపాయాల కల్పన కోసం మూలధన వ్యయం కింద బడ్జెట్‌లో రూ.36,504.45 కోట్లు ప్రతిపాదించగా.. ఆగస్టు వరకు రూ.14,339.54 కోట్లు(39.28ు) వ్యయం చేసినట్టు తెలిపింది.


కేంద్ర గ్రాంట్లు చాలా తక్కువే..

కాగ్‌ వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంలో.. పన్ను రాబడి రూ.59,967 కోట్లు, పన్నేతర రాబడి కింద రూ.1,578 కోట్లు, కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రూ.1,673 కోట్లు సమకూరాయి. ఈసారి రూ.54,009 కోట్లు మార్కెట్‌ రుణాలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా... ఆగస్టు నాటికి రూ.33,415(61.87ు) కోట్లు సేకరించింది. పన్నుల ఆదాయంలో జీఎస్టీ ద్వారా రూ.21,144 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,218 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.14,079 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల కింద రూ.7,758 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.7,413 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల ద్వారా రూ.3,352 కోట్లు సమకూరాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి మొత్తం రూ.22,782.50 కోట్లు గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకోగా.. ఆగస్టు నాటికి రూ.1,673.43 కోట్లు(7.35ు) మాత్రమే అందాయి.

Updated Date - Sep 24 , 2025 | 03:41 AM