Telangana Speaker Office: 8 వారాల సమయం ఇవ్వండి
ABN , Publish Date - Nov 01 , 2025 | 05:15 AM
తెలంగాణలో శాసన సభ్యుల పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరిపేందుకు మరో ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టును స్పీకర్ కార్యాలయం కోరింది.
నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది
మరో నలుగురి విచారణ చివరి దశకు చేరింది
మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల ప్రక్రియ ప్రారంభమైంది
స్పీకర్ల కాన్ఫరెన్స్, విదేశీ పర్యటనలతో ఆలస్యమైంది
వరద సహాయ చర్యలు, పనుల్లో ఎమ్మెల్యేలూ బిజీ
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల విచారణకు సుప్రీంను మరింత గడువు కోరిన స్పీకర్ కార్యాలయం
న్యూఢిల్లీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో శాసన సభ్యుల పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరిపేందుకు మరో ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టును స్పీకర్ కార్యాలయం కోరింది. గతంలో విధించిన మూడు నెలల గడువు శుక్రవారంతో ముగియడంతో మరింత సమయం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయిందని, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. మరో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ చివరి దశకు చేరిందని, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ప్రారంభమైందని వివరించింది. రాజ్యాంగపరమైన స్పీకర్ అధికారాలు, రోజువారీ కార్యక్రమాలు, స్పీకర్ల అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు తదితరాలతో స్పీకర్ బిజీగా ఉన్నారని, దాంతో, గడువులోగా విచారించడం సాధ్యం కాలేదని తెలిపింది. శాసన సభ్యులు సైతం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వరద సహాయక చర్యల కారణంగా నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తోందని పేర్కొంది. ఎమ్మెల్యేలను నేరుగా విచారించాల్సి ఉందని, స్పీకర్, శాసనసభ్యుల షెడ్యూల్ కార్యక్రమాల కారణంగా సమయం సరిపోలేదని పేర్కొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, ఆరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ కూడా సుప్రీంలో రిట్ పిటిషన్ (సివిల్) దాఖలు చేశారు. వాదనలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) దాఖలు చేశారు. వీటన్నిటినీ కలిపి విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం జూలై 31న కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడాన్ని అనుమతించకూడదని, ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం కావాలంటూ సుప్రీంకోర్టుకు స్పీకర్ కార్యాలయం విన్నవించింది.