Share News

Industrial Growth: ఆస్ట్రేలియా వర్సిటీ ఆర్‌ఎంఐటీతో ఎల్‌వోఐ

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:40 AM

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందులో భాగంగానే అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను...

Industrial Growth: ఆస్ట్రేలియా వర్సిటీ ఆర్‌ఎంఐటీతో ఎల్‌వోఐ

  • తెలంగాణను ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌’గా మారుస్తాం.. త్వరలోనే లైఫ్‌ సైన్సెస్‌ స్కూల్‌ను ప్రారంభిస్తాం

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మహదేవపూర్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందులో భాగంగానే అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌’ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. ఆరేస్టలియా పర్యటనలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌లోని ప్రముఖ యూనివర్సిటీ ‘ఆర్‌ఎంఐటీ’తో రాష్ట్ర ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌వోఐ)ను కుదుర్చుకుందని చెప్పారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఇన్నోవేషన్‌, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెడీ టూ వర్క్‌ ఫోర్స్‌ తయారీ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. రేపటి జీనోమ్‌ వ్యాలీకి ఇది ఒక బ్లూ ప్రింట్‌గా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. ఆసియాలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ ‘లైఫ్‌ సైన్సెస్‌’ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 80 బిలియన్‌ డాలర్ల విలువ చేేస 2వేలకు పైగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు ఇక్కడ ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే ఔషధాల్లో మన వాటా 40 శాతంగా ఉందన్నారు. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతును మనమే అందిస్తున్నామన్నారు. త్వరలోనే ప్రత్యేకంగా తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ స్కూల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీధర్‌ బాబు సమక్షంలో తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ ఫౌండేషన్‌ సీఈఓ శక్తి నాగప్పన్‌, ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేథరీన్‌ ఇట్సియోపౌలోస్‌ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు.


తెలంగాణలో ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సిటీ

కాగా, తెలంగాణలో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో ‘ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సిటీ’ని ఏర్పాటు చేేసందుకు ఆరేస్టలియాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ విక్టోరియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వీఐటీ) ముందుకొచ్చింది. ఆరేస్టలియా పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్‌ బాబుతో మెల్‌ బోర్న్‌లో బుధవారం వీఐటీ బోర్డు సభ్యుడు, ఆరేస్టలియా ప్రధాని సన్నిహితుడు అలన్‌ గ్రిఫిన్‌ భేటీ అయ్యారు. అలన్‌ గ్రిఫిన్‌ ప్రతిపాదనను ఆహ్వానించిన శ్రీధర్‌బాబు.. స్థల పరిశీలన, తదుపరి చర్చల కోసం తెలంగాణకు రావాలని ఆహ్వానించారు.

మరిన్ని పెట్టుబడులతో రండి: ‘ఒరికా’కు శ్రీధర్‌ బాబు ఆహ్వానం

దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ‘ఆస్‌ బయోటెక్‌ 2025 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌’లో కీలకోపన్యాసం చేసేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయనను కంపెనీ ప్రతినిధులు బుధవారం ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీధర్‌బాబు.. ఆ సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్‌ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. సంజీవ్‌ గాంధీ మాట్లాడుతూ.. ‘పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, అమలు చేస్తున్న ప్రోత్సాహకర, ప్రగతిశీల విధానాలు అభినందనీయం. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.

Updated Date - Oct 23 , 2025 | 05:40 AM