Services Sector: సేవల రంగంలో తెలంగాణ జోష్
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:37 AM
సేవల సర్వీసెస్ రంగంలో తెలంగాణ దూకుడుగా ముందుకు వెళుతోందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో ‘రాష్ట్ర స్థూల విలువ జోడింపు...
దక్షిణాది రాష్ట్రాల్లోనే మెరుగైన వృద్ధి
‘రాష్ట్ర జీవీఏ’లో సేవల రంగానికి 55ు పైగా ఉన్న రాష్ట్రాల్లో స్థానం
జాతీయ జీఏవీలో 5.22 శాతం వాటాతో 8వ స్థానంలో రాష్ట్రం
‘నీతి ఆయోగ్’ నివేదికలో వెల్లడి
ద్వితీయ, తృతీయ స్థాయి పట్టణాలను ఇన్నోవేషన్ జోన్లుగా వృద్ధి చేయాలని సూచన
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): సేవల (సర్వీసెస్) రంగంలో తెలంగాణ దూకుడుగా ముందుకు వెళుతోందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో ‘రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎ్‌సవీఏ)’లో సేవల రంగం వాటా 55శాతానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఫైనాన్స్, వృత్తిపరమైన సేవలు, డిజిటల్ సర్వీసులలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ గణనీయ వృద్ధి సాధిస్తోందని తెలిపింది. ‘భారత సేవల రంగం: స్థూల విలువ జోడింపు (జీవీఏ) ధోరణులు, రాష్ట్ర స్థాయి క్రియాశీలత’ పేరిట తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. సేవా రంగంలో దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయని తెలిపింది. 2023-24లో తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచే దేశ సేవారంగానికి 40 శాతం వాటా సమకూరిందని వివరించింది. రాష్ట్రాల వారీగా చూస్తే సేవల రంగానికి మహారాష్ట్ర అత్యధికంగా 15.52 శాతంవాటాను అందించింది. కర్ణాటక (10.47 శాతం), తమిళనాడు (8.72), ఉత్తరప్రదేశ్ (7.78 శాతం) వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 5.22 శాతం వాటాతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసులు, డిజిటల్ ప్లాట్‌ఫారాలు వంటి విలువైన, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న సేవా కేంద్రాలను అభివృద్ధి చేయడం వల్లే దక్షిణాది మూడు రాష్ట్రాలు వేగంగా పురోగమిస్తున్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది.
సేవల రంగం వాటా ఆధారంగా నాలుగు కేటగిరీలు..
రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎ్‌సవీఏ)లో సేవల రంగం వాటా ఆధారంగా రాష్ట్రాలను నాలుగు కేటగిరీలు చేసినట్టు నీతి ఆయోగ్ తెలిపింది. సేవల రంగం 55 శాతానికిపైగా ఉన్న రాష్ట్రాలు, 50-55 శాతం మధ్య ఉన్నవి, 40-50 శాతం మధ్య ఉన్నవి, 40 శాతానికంటే తక్కువ వాటా ఉన్నవిగా వర్గీకరించినట్టు తెలిపింది. 55 శాతానికిపైగా వాటా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ఉన్నాయని వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను ఇన్నోవేషన్ జోన్లుగా అభివృద్ధి చేయాలని.. పరిశోధన, అభివృద్ధికి అనుసంధానమైన సేవలకు ఊతమివ్వాలని సూచించింది. 2024-25లో మొత్తంగా దేశ స్థూల విలువ జోడింపు(జీవీఏ)లో సేవల రంగం 55శాతం వాటాను అందించిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఇది వ్యవసాయం వంటి ప్రాథమిక రంగం (16.7ు), మాన్యుఫ్యాక్చరింగ్ వంటి ద్వితీయ రంగం (28.8ు) వాటాల కంటే చాలా ఎక్కువని తెలిపింది. ఉపాధి కల్పనలో ఈ సేవల రంగం 30 శాతం వాటాను కలిగి ఉందని పేర్కొంది.