Showcases Silver Filigree and Nakashi Masks at Global Summit: సిల్వర్ ఫిలిగ్రీ.. నకాశీ మాస్క్
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:30 AM
గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన అతిథులకు తెలంగాణ సాంస్కృతిక కళాకృతులను బహుమతులుగా అందించింది రాష్ట్ర సర్కారు. ప్రసిద్ధి గాంచిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ప్రతిమలు....
గ్లోబల్ సమ్మిట్‌లో మెరిసిన కళాకృతులు
విదేశీ అతిథులకు జ్ఞాపికలుగా అందజేత
చేర్యాల/కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన అతిథులకు తెలంగాణ సాంస్కృతిక కళాకృతులను బహుమతులుగా అందించింది రాష్ట్ర సర్కారు. ప్రసిద్ధి గాంచిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ప్రతిమలు, చేర్యాల నకాశీ మాస్క్‌లను జ్ఞాపికలుగా బహూకరించింది. విదేశీ ప్రతినిధుల కోసం 500 నకాశీ మాస్క్‌లు తయారు చేసి ఇవ్వాలని సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన నకాశీ కళాకారుడు నాగిళ్ల గణేశ్‌ను అధికారులు సంప్రదించారు. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ.2.50 లక్షలు. దీంతో గణేశ్ పని మొదలు పెట్టారు. కుటుంబసభ్యులతో పాటు తన వద్ద శిక్షణ పొందుతున్న వారితో కలిపి మొత్తం 15 మంది సుమారు 15 రోజులు రాత్రింబవళ్లు శ్రమించి మాస్క్‌లు తయారు చేశారు. చింతగింజల పొడి, అంబలి, చెక్కపొట్టు, బంక ఇతరత్రా మిశ్రమాలతో మాస్క్‌లు రూపొందించారు. వాటికి రంగులతో సొబగులద్ది, ఫ్రేమ్‌లుగా తీర్చిదిద్దారు. ఆ ఫ్రేమ్‌లలో గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ లోగోలను ముద్రించారు. మరోవైపు, 60 సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతుల కోసం కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అసోసియేషన్‌కు సర్కారు ఆర్డర్ ఇచ్చింది. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి రూపాన్ని కళాకారులు వెండి తీగలతో తీర్చిదిద్దారు. ఈ ప్రతిమలను 10 రోజుల పాటు 100 మంది కళాకారులు రూపొందించారు. ఒక్కో ప్రతిమకు సుమారు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చయింది. గతంలో ఎన్నో సందర్భాల్లో దేశ విదేశీ ప్రతినిధులు, అతిథులకు నకాశీ మాస్క్‌లు, సిల్వర్ ఫిలిగ్రీ ప్రతిమలను అందజేశారు.