Share News

Batukamma Young Filmmakers Challenge: కళాత్మకంగా తెలంగాణ భవిష్యత్తు

ABN , Publish Date - Dec 30 , 2025 | 06:20 AM

మారుమూల గ్రామాలకు చెందిన ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేసేందుకే రాష్ట్రప్రభుత్వం తెలంగాణ ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ....

Batukamma Young Filmmakers Challenge: కళాత్మకంగా తెలంగాణ భవిష్యత్తు

  • గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకే బతుకమ్మ ఫిలింమేకర్స్‌ ఛాలెంజ్‌ అవార్డులు

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానం

రవీంద్రభారతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామాలకు చెందిన ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేసేందుకే రాష్ట్రప్రభుత్వం తెలంగాణ ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌ -2025ను నిర్వహించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ భవిష్యత్తును కళాత్మక దృష్టితో మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు కృషి జరగాలని ఆకాంక్షించారు. బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌ -2025 అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మంత్రులు కోమట్టిరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ ప్రియాంక, ప్రముఖ సినీ దర్శకులు దశరథ్‌, హరీష్‌ శంకర్‌, నటులు తనికెళ్ల భరణి, అశోక్‌కుమార్‌, గాయకులు రాహుల్‌ సింప్లిగంజ్‌, మంగ్లీ, మోహన భోగరాజు, సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన ప్రయోగానికి తమ ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ వీరత్వానికి, కళలకు పురిటిగడ్డ అని అన్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, ప్రజాపాలనను యంగ్‌ ఫిలిం మేకర్స్‌ తమ కెమెరా కళ్లతో చూశారని ప్రశంసించారు. ఈ ఛాలెంజ్‌లో 500లకు పైగా చిత్రాలు పోటీ పడగా.. షార్ట్‌ ఫిలిం విభాగంలో మొదటి బహుమతి సరస్సు జ్ఞాపకాలు, రెండో బహుమతి సొంతిల్లు, మూడో బహుమతి ఆత్మ గౌరవం చిత్రాలకు దక్కాయి. బతుకమ్మ పాటల విభాగంలో మొదటి మూడు స్థానాల్లో బతుకమ్మ సాంగ్‌, బతుకమ్మ సంబురాలు, అకాశం అంచులు దాటి పాటలు నిలిచాయి. మొదటి బహుమతి కింద రూ.3 లక్షలు, రెండో బహుమతి కింద రూ.2 లక్షలు, మూడో బహుమతి కింద రూ.లక్ష ప్రోత్సాహకాన్ని విజేతలకు అందజేశారు.

Updated Date - Dec 30 , 2025 | 06:20 AM