Share News

Cold Wave: తెలంగాణ గజగజ..!

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:54 AM

తెలంగాణ చలి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5-6 గంటల నుంచే చలి మొదలవుతోంది. ఉదయం 8 దాటినాతగ్గడం లేదు......

Cold Wave: తెలంగాణ గజగజ..!

  • వణుకుతున్న రాష్ట్రం.. 28 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల లోపు నమోదు

  • కోహీర్‌లో అత్యల్పంగా5.4 డిగ్రీలు

  • 1946లో హైదరాబాద్‌లో 6.1 డిగ్రీలు

  • ఏడేళ్ల క్రితం 6.3.. మళ్లీ ఇప్పుడు కూడా..

  • ఈ నెల 18-22 మధ్య మరింత చలి!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తెలంగాణ చలి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5-6 గంటల నుంచే చలి మొదలవుతోంది. ఉదయం 8 దాటినాతగ్గడం లేదు. గురువారం రాత్రి 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. దీన్నిబట్టే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 6, హైదరాబాద్‌ శివార్లలోని శేరిలింగంపల్లి, సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంతాల్లో 6.3 డిగ్రీల ఉష్ణోగత్రలు రికార్డయ్యాయి. 2014 డిసెంబరు 28న కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 1.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రస్తుత చలి తీవ్రత చూస్తుంటే ఈ ఏడాది కూడా ఆ స్థాయికి రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

వణుకుతున్న హైదరాబాద్‌

రాజధాని హైదరాబాద్‌లోనూ ఈసారి చలి తీవ్రత అధికంగానే ఉంది. ఏడేళ్ల క్రితం డిసెంబరులో నగరంలో కనిష్ట ఉష్ణగ్రతలు 6.3 డిగ్రీలకు పడిపోయాయి. మళ్లీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, శేరిలింగంపల్లిలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మౌలాలిలో 7.1, రాజేంద్రనగర్‌లో 7.7, శివరాంపల్లిలో 8.8, గచ్చిబౌలిలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, 1946 జనవరి 8న హైదరాబాద్‌లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 11 డిగ్రీల్లోపే

గురువారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగానే ఉంది. ఐదు జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10-11 డిగ్రీల మధ్య నమోదవ్వగా, మిగిలిన అన్నిచోట్ల 9.8 డిగ్రీలలోపు రికార్డు అయ్యాయి. రాబోయే మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు సైతం 27-29 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది.. ఈ నెల 18-22 తేదీల మధ్య రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

చలికి తోడు పొగమంచు

చలి తీవ్రతకు తోడు ఉదయం వేళల్లో భారీగా పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Updated Date - Dec 13 , 2025 | 05:54 AM