Telangana Education: భాషా బోధనలో తెలంగాణ భేష్
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:45 AM
జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా తెలంగాణలో మాతృభాష ఆధారంగా వివిధ భాషలను నేర్చుకోవడంపై వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయని ఐరాసకు చెందిన విద్య,....
మాతృభాష ఆధారంగా బహు భాషల బోధన
ఆదివాసీ భాషల్లోనూ కథల పుస్తకాల అనువాదం
9 భాషల్లో నిఘంటువులు.. యునెస్కో కితాబు
న్యూఢిల్లీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా తెలంగాణలో మాతృభాష ఆధారంగా వివిధ భాషలను నేర్చుకోవడంపై వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయని ఐరాసకు చెందిన విద్య, సాంస్కృతిక సంస్థ యునెస్కో తెలిపింది. ‘లాంగ్వేజ్ మ్యాటర్స్’ అన్న శీర్షికతో మాతృభాష, బహుభాషల్లో విద్యపై యునెస్కో బుధవారం స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్-2025 నివేదికను విడుదల చేసింది. ఆదివాసీ, మైనారిటీ విద్యార్థుల కోసం కూడా తెలంగాణలో మాతృభాష ఆధారిత బహుభాషల విద్యకు బలమైన మద్దతు లభిస్తోందనివెల్లడించింది. ఆదివాసీ భాషల్లో కూడా చిన్న పుస్తకాలు, పాఠ్యప్రణాళికా వనరులను రూపొందించారని ప్రశంసించింది. తెలంగాణలో 8 భారతీయ బాషల్లో 274 పాఠ్యపుస్తకాలను రూపొందించారని, తెలుగు-ఇంగ్లిష్, ఉర్దూ-ఇంగ్లిష్ వంటి భాషల్లో కూడా పుస్తకాలు తయారు చేశారని తెలిపింది. దీక్ష ద్వారా క్యూఆర్ ఆధారిత బోధనా సామగ్రి, టి-శాట్ ద్వారా పాఠాల బోధన వివిధ భాషల్లో జరుగుతోందని వివరించింది. తద్వారా మాతృభాషల నుంచి పాఠశాల భాషలకు సాఫీగా పరివర్తనం జరుగుతోందని తెలిపింది. తెలంగాణ ఎస్‌సీఈఆర్టీ 9 భాషల్లో సమగ్ర డిజిటల్ నిఘంటువును రూపొందించిందని, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంచుకోవడానికి తగిన ప్రాధాన్యం లభిస్తోందని వెల్లడించింది. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో బోధన విషయంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ లభిస్తోందని పేర్కొంది. లంబాడి, గోండి, కొలామీ వంటి ఆదివాసీ భాషల్లో కథల పుస్తకాల అనువాదం జరిగిందని, సమాచారాన్ని ఆదివాసీ భాషల్లో అందించేదుకు ఏఐ ఆధారిత వ్యవస్థను రూపొందించారని తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో ఏఐ ఆధారంగా గోండి, కొలామీ భాషలను పునరుద్ధరించేందుకు తీసుకుంటున్న చర్యలను యునెస్కో ప్రశంసించింది. తెలంగాణలో లిపి, భాష మధ్య సంబంధాలు, డిజిటల్ సంసిద్ధత చాలా బాగుందని వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఇంగి్‌ష్ల-విదేశీ భాషల యూనివర్సిటీతో యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకొని పది ప్రాథమిక గ్రేడ్ తరగతి గదుల్లో బహుభాషా విద్యను నేర్పారని తెలిపింది. ఆంగ్లంతోపాటు స్థానిక భాషల్లోనూ శబ్దావళిని రూపొందించారని పేర్కొంది. డిజిటల్ సదుపాయాలు, బహు భాషలతో కూడిన గ్రంథాలయాలు, అనువాద పరికరాలు వంటి వాటి వల్ల కొత్త మార్గాలు ఏర్పరిచారని యునెస్కో ప్రశంసించింది. ఎస్‌సీఈఆర్టీలు, టీఆర్‌ఐలు, వర్సిటీలు, ఎన్జీవోలు, సాంస్కృతిక సంస్థలు, టెక్నాలజీ బృందాల మఽధ్య బలమైన భాగస్వామ్యాలు ఉన్నాయి. ఆదివాసీల భాషలు, భాష, సంస్కృతి, పర్యావరణం, అనుభవం ద్వారా నేర్పించడం ద్వారా బలమైన పునాది ఏర్పడుతోందని, తరగతి గదుల్లో అందరికీ అందుబాటులో ఉండే సరైన పద్ధతులను అవలంబిస్తున్నారని యునెస్కో కొనియాడింది.