Minister Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:55 AM
రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు..
జిల్లాస్థాయిలో 33 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు..
రాష్ట్రస్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటు: మంత్రి పొన్నం
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకు నిరంతర నిఘా ఉండేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ కఠినతరం చేయడంపై రవాణా శాఖ ముఖ్య అధికారులతో సచివాలయంలో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు జిల్లాల వారీగా 33 బృందాలు, రాష్ట్రస్థాయిలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలు ప్రతి రోజు విధిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ముఖ్యంగా ఓవర్ లోడింగ్ లారీలు, బస్సులు, ఇసుక, ఫ్లై యాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్ రవాణా వాహనాలు, వాహనాల ఫిట్‌నెస్, పొల్యూషన్, చలానాలపై ఈ బృందాలు తనిఖీలు చేపట్టాలని మంత్రి వివరించారు. ఓవర్‌లోడింగ్ చేసిన వాహనాలకు అదనపు పెనాల్టీ విధించడంతోపాటు ఆ వాహనాన్ని సీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. గత వారం చేవెళ్ల సమీపంలో జరిగిన టిప్పర్, ఆర్టీసీ బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 2,576 కేసులు నమోదు చేశామని రవాణా శాఖ అధికారులు మంత్రికి వివరించారు. డిసెంబరులో చేపట్టనున్న ‘రోడ్డు భద్రత నెల’పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.
మహిళలకు ఆటో అనుమతులు
ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేస్తున్నట్లే హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆటోలకు అనుమతుల విషయంలోనూ మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఇందుకు కార్యాచరణ రూపొందించాలని రవాణా శాఖ అధికారుల్ని మంత్రి ఆదేశించారు.