Net Zero Vision: పవర్‌ఫుల్ తెలంగాణ!
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:15 AM
తెలంగాణ రాష్ట్రం 2047 కల్లా నెట్ జీరో శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించేసి, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడం ద్వారా ఉద్గారాలను శూన్య స్థితికి తగ్గించడం)కి చేరడమే లక్ష్యంగా పెట్టుకుంది.....
స్వచ్ఛ ఇంధన కేంద్రంగా తెలంగాణ.. 2047 నాటికి ఉద్గార రహితంగా మార్చడమే లక్ష్యం
9 రంగాలపై సర్కారు దృష్టి
విజన్ డాక్యుమెంట్‌లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక
హైదరాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం 2047 కల్లా ‘నెట్ జీరో’ (శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించేసి, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడం ద్వారా ఉద్గారాలను శూన్య స్థితికి తగ్గించడం)కి చేరడమే లక్ష్యంగా పెట్టుకుంది. పునరుత్పాదక శక్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడంతో పాటు స్వచ్ఛ, హరిత ఇంధన కేంద్రంగా మార్చాలని కూడా ధ్యేయంగా నిర్దేశించుకుంది. విజన్ డాక్యుమెంట్ 2047 ద్వారా.. తెలంగాణను శక్తిమంతమైన రాష్ట్రంగా మలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐ సిటీ రూపకల్పన, వివిధ రంగాల మైక్రో డేటా నిల్వ చేసుకునేలా సొంతంగా క్లౌడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు, విదేశీ పెట్టుబడులే కాదు.. అక్కడి మేధో సంపత్తిని పరిశోఽధనల కోసం ఆహ్వానించడం, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలే కాదు.. ఉద్యోగాలు సృష్టించే మానవ వనరులకే పెద్దపీట అని చెప్పడం ద్వారా తెలంగాణకు ఏం కావాలనేది విజన్ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా 9 రంగాలపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. వాటిని ఆచరణలోకి తీసుకొచ్చేలా విస్తృత కార్యాచరణను రూపొందించుకుంది. స్వచ్ఛ ఇంధనం, స్మార్ట్ రవాణా, పారిశ్రామిక కర్బన ఉద్గారాలను తగ్గించడం, వ్యవసాయంలో మార్పులు, అడవుల పెంపు, పట్టణ మౌలిక వసతుల్లో మార్పు.. ఇలా తొమ్మిది అంశాల్లో తన విధానాలను ప్రపంచం ముందు పెడుతోంది.
పునరుత్పాదక శక్తిలో అగ్రగామిగా..
పునరుత్పాదక శక్తిలో అగ్రస్థానంలో నిలిపేలా రాష్ట్రాన్ని స్వచ్ఛ, హరిత ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా 2047కు లక్ష్యాలు నిర్దేశించుకుంది. శూన్య ఉద్గారాల సాధన; సౌర, పవన, బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత విద్యుత్తు వ్యవస్థకు పెద్దపీట వేయడం; థర్మల్ కేంద్రాలను హానికరమైన సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌ల నియంత్రణ టెక్నాలజీలతో నవీకరించాలని లక్ష్యాలుగా పెట్టుకుంది. 2026నాటికి గంటకు 100 టెరావాట్స్ ఉన్న విద్యుత్తు డిమాండ్ 2047నాటికి 780 టెరావాట్స్‌కు చేరనుంది. దీంతో 2047నాటికి 90ు పునరుత్పాదక శక్తి, మిగిలిన 10 శాతానికి క్లీన్ థర్మల్, కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజీ, స్మార్ట్ గ్రిడ్లు, గ్రీన్ హైడ్రోజన్, అధునాతన స్టోరేజ్ వ్యవస్థల ఏర్పాటు.. సౌర, పవన, ఫ్లోటింగ్ సోలార్ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సమీకృత స్మార్ట్ రవాణా..
భవిష్యత్తులో తెలంగాణ రవాణా రంగం పూర్తిగా కాలుష్య రహితంగా మారనుందని ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. 2030నాటికి దేశంలో అత్యధిక విద్యుత్తు బస్సులు తిరిగే నగరంగా హైదరాబాద్‌ను నిలపడం; 2047నాటికి అన్ని రోడ్డు రవాణా రంగాల్లో కాలుష్యరహిత వాహనాలుగా మార్చడం; 2039తర్వాత డీజిల్, పెట్రోల్ వాహనాల అమ్మకాలపై దశలవారీ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. ఇందులో భాగంగా 2030 నాటికి 6000 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, 2047 నాటికి ప్రతి 20 కి.మీ.కు ఒక ఫాస్ట్ చార్జింగ్ కారిడార్, హైడ్రోజన్ రీఫిల్లింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు; మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణ, ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, టీవోడీ విధానంతో నడక, సైక్లింగ్‌కు ప్రాధాన్యం, అధిక రద్దీ ఉన్న మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ల ఏర్పాటుపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది.
నెట్ జీరో పరిశ్రమ
తెలంగాణను నెట్ జీరో పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం తెలంగాణ పారిశ్రామిక డీకార్బనైజేషన్ మిషన్ (టీఐడీఎం) ఏర్పాటు, రామగుండం, సింగరేణి, భూపాలపల్లి మొదలైన ప్రాంతాల్లో సీసీయూఎస్ (కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ స్టోరేజ్) పైలెట్లు; నల్లగొండ-సూర్యాపేటలో హైడ్రోజన్ హబ్‌లు, పరిశ్రమలకు గ్రూప్ క్యాప్టివ్ ఆర్‌ఈ ప్లస్ బీఈఎ్‌సఎస్ (ఒక్క కంపెనీకాకుండా పలు కంపెనీలు పవర్ ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టి, ఉత్పత్తయ్యే విద్యుత్తులో వాటాలు పొందడం); 2030 నాటికి 80 శాతం రెడ్/ఆరెంజ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలకు మార్చడం; వ్యర్థాల శుద్ధి, ఎల్‌సీ3 సిమెంట్, వేస్ట్ హీట్ రికవరీ.. కార్బన్ కనెక్ట్ తెలంగాణ పేరుతో షేర్డ్ కార్బన్-హైడ్రోజన్ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం.
వాతావరణానికి తగ్గట్లుగా వ్యవసాయం
వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చే దిశగా విజన్ డాక్యుమెంట్‌లో ప్రణాళికలను ప్రస్తావించింది. 2047నాటికి పూర్తిగా ఏడబ్ల్యూడీ/డీఎ్‌సఆర్ ఆధారిత వరి సాగు (నీటిని ఆదా చేసే రెండు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు), బయోచార్, సీబీజీ, 30-40 శాతం ఎంటెరిక్ మీథేన్ తగ్గింపు.. సౌర పంపులు, సౌర మైక్రోగ్రిడ్లు, ఎఫ్‌పీవో వద్ద సౌర డ్రైయర్లు, కోల్డ్ చైయిన్లు, నెట్‌జీరో టెక్‌ఆధారిత రైస్ మిల్లులు, తెలంగాణ గ్రీన్‌టెక్ రైస్ పేరుతో ఎగుమతి బ్రాండింగ్.
వ్యర్థాలను సంపదగా మార్చడం
2047 నాటికి రాష్ట్రం ‘సర్క్యులర్, మీథేన్-నేచురల్ వేస్ట్ ఎకానమీ’గా మారనుంది. ఇందుకుగాను వ్యర్థాలను వందశాతం వేరుచేయడం, జీహెచ్‌ఎంసీలో 200 మెగావాట్ల ‘వ్యర్థాల నుంచి ఇంధనం’ ప్రాజెక్టుల ఏర్పాటు, ఏఐ ఆధారిత నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు.
అడవుల పునరుద్ధరణ.. హరిత ప్రాంత పరిధి పెంపు
2047 నాటికి రాష్ట్రంలో మూడో వంతు ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 250 కోట్ల మొక్కలు నాటడం, సహజ పునరుత్పత్తి ద్వారా అడవుల పునరుద్ధరణ, ఆగ్రో ఫారెస్ట్రీని పది లక్షల హెక్టార్లకు పెంచడం, ఎసీసీఎల్ మైనింగ్ ప్రాంతాల్లో మైన్ టు ఫారెస్ట్ కార్యక్రమ అమలు, ఏఐ డ్రోన్ల ద్వారా అటవీ సంరక్షణ చర్యలు, కార్బన్ క్రెడిట్ ఆధారిత పీఈఎస్ ప్రోత్సాహకాలు ఇవ్వడం.
నెట్ జీరో పట్టణాలు
తెలంగాణ పట్టణాలను సౌరశక్తి, హరిత మౌలిక వసతులతో ఆధునికీకరించాలని సర్కా రు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం టీజీ రెడ్కో సౌర విధానం 2.0కింద రూఫ్‌టాప్, బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ ఫొటోవోల్టాయిక్స్ విస్తరణ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎ్‌సఎ్‌సబీని ఎనర్జీ న్యాచురల్/పాజిటివ్ యుటిలిటీలుగా తీర్చిదిద్దడం, ఐజీబీసీలో గ్రీన్‌సిటీ సర్టిఫికేషన్ అమలుచేస్తారు.
ప్రజా భాగస్వామ్యంతో పచ్చదనం
పచ్చదనం పెంపునకు ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో జిల్లా హరిత ఉపాధి కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో గ్రీన్ స్కిల్ అకాడమీలు, పాఠశాలల్లో పచ్చదనం ప్రాధాన్యంపై పాఠాలు; యువత, పొదుపు సంఘాలు, ఎకో క్లబ్ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం.
నెట్‌జీరో విధివిధానాలు
రాష్ట్ర స్థాయిలో నెట్ జీరో అమలుకు ప్రత్యేక సంస్థలు, డిజిటల్ వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం తెలంగాణ నెట్ జీరో సంస్థను ఏర్పాటు చేయడం, అన్ని శాఖల డేటాను కలిపే క్లైమేట్ డీపీఐ, తెలంగాణ క్లైమేట్ ఫండ్ ఏర్పాటు, కార్బన్ మార్కెట్ ఫ్రేమ్ వర్క్, తెలంగాణ కార్బన్ రిజిస్ట్రీ నెలకొల్పడంతోపాటు కార్బన్ ప్రాజెక్టు ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు.