Minister Sridhar Babu: తెలంగాణకు పెట్టుబడుల వర్షం
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:06 AM
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం భారీ పరిశ్రమలకు నిలయంగా మారనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు...
భారీ పరిశ్రమలకు నిలయంగా రాష్ట్రం
భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయడమే లక్ష్యం
తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమయ్యేలా గ్లోబల్ సమ్మిట్: మంత్రి శ్రీధర్‌బాబు
కందుకూరు/మహేశ్వరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం భారీ పరిశ్రమలకు నిలయంగా మారనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ప్యూచర్‌సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారని, సమ్మిట్ వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు పెట్టుబడుల వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025 పనులను మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రి పరిశీలించారు. మహేశ్వరం మండలం కేసీ తండా సమీపంలోని ఎలక్ర్టానిక్ సిటీలో జేఎ్‌సడబ్ల్యూ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న డ్రోన్ల తయారీ కేంద్రానికి భూమిపూజ అంతకుముందు కందుకూరులో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఈ నెల 9న తమ ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన ప్రగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తారని తెలిపారు. ఈ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలమైనదని, ఆ మేరకే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇక హైదరాబాద్, వరంగల్‌లో ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముందుగా వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కాగా, 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులతో దేశంలో ఎక్కడా లేని డ్రోన్ల తయారీ కేంద్రం మహేశ్వరంలో ఏర్పాటు కావడం అభినందనీయమని మంత్రి అన్నారు. భారత సాయుద బలగాల అవసరాలకు తగ్గట్టుగా భారత్‌లో పెద్ద ఎత్తున వీ బ్యాట్‌లను ఉత్పత్తి చేసేందుకు జేఎ్‌సడబ్ల్యూ సంస్థ ముందుకు రావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో జేఎ్‌సడబ్ల్యూ సంస్థ ప్రతినిధులు సర్జన్ షా, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.