Liquor Shop License Applications: ఒక్కరోజే 25వేల దరఖాస్తులు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:27 AM
రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దరఖాస్తుల కోసం శుక్రవారం ఒక్కరోజే సుమారు 25వేల దరఖాస్తులు వచ్చాయి. వీటితో కలిపి మొత్తం దరఖాస్తుల సంఖ్య దాదాపు..
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 50 వేలకు చేరిన దరఖాస్తులు.. నేడే ఆఖరు
లక్ష దరఖాస్తులు వస్తాయనుకుంటేసగమే రావడంతో ఎక్సైజ్ వర్గాల్లో ఆందోళన
తుదిరోజైన శనివారం రద్దీపైనే అధికారుల ఆశలు
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దరఖాస్తుల కోసం శుక్రవారం ఒక్కరోజే సుమారు 25వేల దరఖాస్తులు వచ్చాయి. వీటితో కలిపి మొత్తం దరఖాస్తుల సంఖ్య దాదాపు 50 వేలకు చేరింది. శనివారంతోనే ఈ దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తంగా లక్షకుపైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌శాఖ అంచనా వేసుకోగా.. ఇప్పటివరకు అందులో సగమే రావడంతో ఎక్సైజ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చివరిరోజైన శనివారం భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించేందుకు గత నెల 25న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తిరిగి చెల్లించని (నాన్ రిఫండబుల్) విధానంలో ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు. మొత్తంగా సర్కారుకు రూ.3వేల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అయితే, ఈ నెల 16 వరకు 20 రోజుల్లో సుమారు 25వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. శుక్రవారం రాత్రివరకు మరో 25 వేల దరఖాస్తులు రావడంతో.. మొత్తం దరఖాస్తులు 50వేల వరకు చేరాయి. చివరిరోజైన శనివారం (18న) ఎన్ని దరఖాస్తులు వస్తాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
గడువు పెంపుపై తర్జనభర్జన
లక్ష్యం మేరకు దరఖాస్తులు రాకపోవడంతో గడువు పెంచితే ఎలా ఉంటుందన్న దానిపై ఎక్సైజ్ శాఖ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. అయితే 19న ఆదివారం, తర్వాత దీపావళి సెలవు, ఆ తర్వాత మంచిరోజులు లేకపోవడం వల్ల గడువు పెంచినా ప్రయోజనం ఉండకపోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పైగా మద్యం దుకాణాల దరఖాస్తుల అమ్మకాలు పెంచి ఆదాయం రాబట్టుకోవడానికి చూస్తోందని ప్రభుత్వం విమర్శలు వస్తాయని పేర్కొన్నట్టు సమాచారం.
సిండికేట్లుగా దరఖాస్తులతోనూ..!
హైదరాబాద్‌లోని ఒక మద్యం దుకాణానికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్టు తెలిసింది. రిజర్వుడ్ దుకాణాలకూ గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గినట్టు సమాచారం. వ్యాపారులు సిండికేట్లుగా మారి కొన్నే దరఖాస్తులు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన చోట ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.