Phone Tapping Case: ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక సమర్పణకు సమయమివ్వండి
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:45 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్) నివేదిక సమర్పించేందుకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం...
‘ట్యాపింగ్’ కేసులో సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కారు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్) నివేదిక సమర్పించేందుకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం.. కేసు విచారణను వాయిదా వేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీనిలో అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడని 2023లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారతదేశానికి తిరిగొస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. ఈ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ (ఇంటరిమ్ ప్రొటెక్షన్) కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ మరోసారి బుధవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ సర్కారు తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్ ్థ లూథ్రా వాదించగా.. ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు హాజరయ్యారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదిక వచ్చిందని, దాన్ని సమర్పించేందుకు వారం సమయం ఇవ్వాలని సర్కారు తరఫు న్యాయవాదులు కోరడంతో కేసును ధర్మాసనం 14వ తేదీకి వాయిదా వేసింది.