Minister Uttam Kumar Reddy: 53 లక్షలు కాదు.. 80 లక్షల టన్నులు కొనాలి
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:56 AM
భారత ఆహార సంస్థ ఎఫ్‌సీఐ ఈ వానాకాలం సీజన్‌కుగాను 53లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చిందని, అయితే రాష్ట్రంలో ధాన్యం..
ధాన్యం సేకరణకు కేంద్రం సహకారం అవసరం
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్ లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఈ వానాకాలం సీజన్‌కుగాను 53లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చిందని, అయితే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో.. 80లక్షల టన్నుల సేకరణకు అనుమతివ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని హైదరాబాద్‌లో మీడియాకు ఆయన విడుదలచేశారు. 80 వేల టన్నులు అనేది దేశ చరిత్రలోనే పెద్ద లక్ష్యమని అన్నారు. ధాన్యం సేకరణకు రూ.20 వేల కోట్లు అవుతుందని, బోనస్, రవాణా ఖర్చులు కలిపి రూ.24 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెరుగుతుందని, ఇంత భారీ మొత్తంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు వెచ్చించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సేకరణ లక్ష్యం పెంచాలని, అదనపు నిల్వ, రవాణా సదుపాయాలు కల్పించాలని, డెలివరీ నిబంధనలు సడలించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వలు పేరుకపోయాయని, దీంతో స్టోరేజీ సమస్య ఎదురవుతోందని, సీఎంఆర్ డెలివరీని పెంచాలంటే రాష్ట్రంలోని బియ్యం నిల్వలను తరలించాలని, తక్షణమే 300 రైల్వే రేకులు ఏర్పాటుచేయాలని ప్రహ్లాద్ జోషికి లేఖలో విన్నవించారు. రాష్ట్రంలో 22.61 లక్షల టన్నుల ఎఫ్‌సీఐ గిడ్డంగుల నిల్వ సామర్థ్యం ఉంటే.. 21.72 లక్షల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని తెలిపారు. కేవలం 89వేల టన్నుల బియ్యం పట్టే స్థలమే మిగిలి ఉందని తెలిపారు. యాసంగి 2024- 25లో 74 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, కానీ కేంద్రం 53లక్షల టన్నులకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, మిగిలిన 10లక్షల టన్నుల బియ్యాన్ని ముడి బియ్యం రూపంలో కాకుండా, బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) రూపంలో తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ బియ్యం సేకరణ గడువు ఈ ఏడాది అక్టోబరు 31 వరకే ఉన్నదని, ఇంకా 30 లక్షల టన్నుల బియ్యం బకాయులున్న నేపథ్యంలో సీఎంఆర్ డెలివరీ గడువును మూడు నెలలు పొడిగించాలని, 2026 జనవరి 31 వరకు సమయం ఇవ్వాలని కేంద్ర మంత్రిని ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు.
2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 8 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, కానీ 7 లక్షల టన్నులు రా రైస్‌మిల్లర్ల వద్ద ఉన్నదని, లక్ష టన్నులు బాయిల్డ్ రైస్ రూపంలో ఉన్నదని, దీనికి కూడా మినహాయింపు ఇవ్వాలని లేఖలో ఉత్తమ్ విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో బాయిల్డ్ రైస్ మాత్రమే సరఫరా చేయాలనే నిబంధనపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వానాకాలం సీజన్‌లో ఉత్పత్తి అయ్యే ధాన్యం ముడిబియ్యం తయారీకి అనుకూలమని అందుకే రా రైస్, బాయిల్డ్ రైస్ రెండింటికి అనుమతివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బాయిల్డ్‌రైస్ లక్ష్యాన్ని యాసంగి సీజన్‌కు మార్చాలని కోరారు. ఎఫ్‌సీఐ బియ్యాన్ని కిలోకు రూ.24 చొప్పున ఓపెన్ మార్కెట్ సేల్‌లో విడుదల చేయటంతో రైతులకు కిలోకు రూ.16 నుంచి రూ.17 చొప్పున మాతమ్రే ధర వస్తోందని, ప్రైవేటు కొనుగోలుదారులు కూడా నిరుత్సాహపడుతున్నారని ఉత్తమ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధరకు వీలైనంత ఎక్కువ ధాన్యం కొనుగోలుచేయాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. అందుకే ఈ ఖరీఫ్‌లో 45-50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30- 35 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం సేకరించేందుకు ప్రణాళిక తయారుచేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ తగ్గిస్తే తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.