Panchayat Elections See Heavy Competition: ఒక్కో సీటుకు.. నలుగురి పోటీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:59 AM
రాష్ట్రంలో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ స్థానానికి నలుగురు పోటీపడుతున్నారు. ఈ దశలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకుగాను....
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో3,911 సర్పంచ్ స్థానాలకు 13,128మంది పోటీ
415 స్థానాలు ఏకగ్రీవం
38,342 వార్డు సభ్యుల స్థానాల్లో 8,304 ఏకగ్రీవం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ స్థానానికి నలుగురు పోటీపడుతున్నారు. ఈ దశలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకుగాను 415 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. రిజర్వేషన్లు, ఇతర కారణాలతో 5 చోట్ల ఒక్క నామినేషన్ కూడా రాలేదు. మిగతా 3,911 సర్పంచ్ స్థానాల కోసం 13,128 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక రెండో విడతలో 38,342 వార్డుసభ్యులు ఉండగా, 8,304 స్థానాలు ఏకగీవ్రమయ్యాయి. 107 చోట్ల ఒక్క నామినేషన్ కూడా రాలేదు. దీనితో మిగిలిన 29,903 వార్డుల కోసం 78,158 మంది బరిలో మిగిలారు. అంటే సగటున ఒక్కో వార్డుకు 2.5 మంది పోటీపడుతున్నారు. ఈ నెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ప్రలోభాలకు పాల్పడిన వారిపై కేసులు
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న ఆరోపణలతో సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లిలో ఓటర్లకు మాంసాహార విందు ఏర్పాటు చేసి ప్రలోభానికి గురిచేస్తున్న సర్పంచ్ అభ్యర్థి పన్యాల అర్చన, ఆమె భర్త శ్రీనివా్‌సరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎంపీడీవో మార్టిన్ లూథర్ తెలిపారు. ఇక ఇదే జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలో సర్పంచ్ అభ్యర్థి నిమ్మ ప్రతిభారెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టడానికి తమ ఇంటివద్ద భోజనాలు ఏర్పాటు చేశారని రాజగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గ్రామంలో మరో సర్పంచ్ అభ్యర్థి భర్త చారగొండ మానస ప్రభాకర్‌రెడ్డి సూచనల మేరకు పంచడానికి మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టామని, మద్యం తరలిస్తున్న పిల్లి ప్రభాకర్, పిల్లి అజయ్‌లపై కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా, భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ పదవిని రూ.12 లక్షలకు వేలం వేసినట్టు తెలిసింది. ఉప సర్పంచ్ పదవిని కూడా వేలం వేయాలని ప్రయత్నించగా.. ఇద్దరు, ముగ్గురు ఆశావహులు ఉండటంతో జరగలేదని సమాచారం.
ఐదేళ్లలో పెరిగే ఆస్తులు.. ప్రజలకే పంచుతా
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో ఓ అభ్యర్థి గతంలో సర్పంచ్‌గా పోటీచేసి ఒక్క ఓటుతో ఓడిపోయారు. ఇప్పుడు దానిని గుర్తుచేస్తూ కరపత్రం వేశారు. ఈసారి తనను సర్పంచ్‌గా ఎన్నుకుంటే.. వచ్చే ఐదేళ్లలో తన ఆస్తులు ఎంత పెరిగినా అవన్నీ పంచాయతీకి జప్తు చేసి, ప్రజలకు పంచుతానని అందులో హామీ ఇచ్చారు. ఇంటింటికీ తిరిగి ఈ కరపత్రాన్ని పంచుతున్నారు.
హామీలు తీర్చకుంటే చెప్పుల దండ వేస్కుంటా
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల పంచాయతీ బీసీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజేశ్వరి తాను గెలిచాక గ్రామాభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని.. లేకుంటే గ్రామంలోని కులానికో చెప్పును తన మెడలో వేసుకొని బహిరంగంగా రాజీనామా చేసి వెళ్లిపోతానని బాండ్ పేపర్‌పై రాసివ్వడం చర్చనీయాంశంగా మారింది.