Share News

YatraDaanam: ఆర్టీసీ యాత్రాదానం...

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:41 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ‘యాత్రాదానం’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రసిద్థ పుణ్యక్షేత్రాలకు..

YatraDaanam: ఆర్టీసీ యాత్రాదానం...

  • ప్రత్యేక సందర్భాలకు యాత్రలనుదానం చేసే సదుపాయం

  • పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ‘యాత్రాదానం’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రసిద్థ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు అనాథలు, నిరాశ్ర యులైన వృద్ధులు, నిరుపేదలను తీసుకెళ్లడమే ‘యాత్రాదానం’ ముఖ్య ఉద్దేశమని సంస్థ పేర్కొంది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ కార్యక్రమ పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో పాటు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్‌ సంస్థలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ యాత్రాదానం కార్యక్ర మానికి విరాళాలు అందించాలని ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక నిధిని సంస్థ ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. తమ ప్రత్యేకమైన, సంతోషకరమైన రోజుల్లో కొంత మొత్తాన్ని సంస్థకు విరాళం ఇవ్వడం ద్వారా ఇతరులకు ఆనందం కలిగించాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవలో భాగంగా వినూత్న ఆలోచనతో ముందుకొచ్చిన ఆర్టీసీ యాజమాన్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందించారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే స్తోమత లేనివారికి యాత్రాదానం ఒక వరమన్నారు. కాగా, యాత్రాదానం నిధికి మంత్రి పొన్నం ప్రభాకర్‌, సజ్జనార్‌ చెరో లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను సంస్థ రూపొందించింది. టూర్‌ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని, మరింత సమాచారం కోసం ఆర్టీసీ హెల్ప్‌ లైన్‌ నంబర్లు 040-69440000, 040- 23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ప్రకటించింది.

Updated Date - Sep 10 , 2025 | 04:41 AM