Telangana RTC: ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీ!
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:05 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎ్‌సఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి తొలి ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ నుంచి ఒక్క...
రాష్ట్రం ఏర్పడ్డాక సంస్థ నుంచి తొలి నోటిఫికేషన్.. డ్రైవర్ 1000.. శ్రామిక్ 743 ఖాళీల భర్తీ
8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్ నియామక బోర్డు
ఆర్టీసీ నియామక విభాగాన్ని పక్కన పెట్టిన వైనం!
మొత్తం ఖాళీలు 3080.. సగం పోస్టులకే నోటిఫికేషన్
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్‌సఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీకి తొలి ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆర్టీసీలో 3080 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది కిందట అనుమతి ఇవ్వగా.. అధికారులు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా ఆర్టీసీ నియామక విభాగం ద్వారా కాకుండా ఈ సారి రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. టీజీఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1743 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో డ్రైవర్ 1000, శ్రామిక్ 743 పోస్టులు ఉన్నాయి. అక్టోబరు 8 నుంచి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు అక్టోబరు 28 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్హత, ఇతర వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీజీపీఆర్‌బీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. డ్రైవర్లకు పే స్కేల్ రూ.20,960-60,080; శ్రామిక్‌లకు రూ.16,550-45,030 వరకు ఉంటుందని వెల్లడించారు.
మిగతా పోస్టుల భర్తీ ఎన్నడో?
ఆర్టీసీలో మొత్తం 3080 పోస్టుల భర్తీకి సుమారు ఏడాది క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 2 వేల డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అయితే తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో 1000 డ్రైవర్ పోస్టులనే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మిగతా పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుందోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూసిన వారు.. సగం పోస్టులకే ప్రకటన ఇవ్వడంతో నిరాశ చెందారు. ఖాళీల భర్తీపై 14 నెలల జాప్యం తర్వాత వెలువడ్డ నోటిఫికేషన్‌లో సగం పోస్టులనే ప్రకటించడం సరికాదని నిరుద్యోగులు వాపోతున్నారు. మిగిలిన పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు పెద్దఎత్తున ఖాళీలు ఉన్నాయి. కనీసం 2 వేల పోస్టుల భర్తీకి అనుమతించాలని అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ నియామక సెల్ కాకుండా..
ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత పోలీసు నియామక బోర్డుకు అప్పగించడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో చివరి సారిగా ఆర్టీసీలో నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. సాధారణంగా ఆర్టీసీలో డ్రైవర్ నుంచి అధికారి వరకు అన్ని పోస్టుల భర్తీ ఆర్టీసీ నియామక విభాగమే చేపడుతుంది. కానీ, తెలంగాణలో తొలిసారి వెలువడిన నోటిఫికేషన్‌లో ఆర్టీసీ సొంత విభాగానికి కాకుండా పోలీస్ బోర్డుకు అప్పగించడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం రద్దీ మార్గాల్లో ప్రయాణికులతో బస్సు నడపడం అంత సులువైన విషయం కాదని, పోలీస్ నియామక బోర్డు చేపట్టే భర్తీ ప్రక్రియ పూర్తయి, కొత్త వారు విధుల్లో చేరేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు.