Telangana Rising Summit: రూ.3లక్షల కోట్లు
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:48 AM
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాల విలువ రూ.3లక్షల కోట్లకు చేరింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులకు 50 కంపెనీలు సిద్ధం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతామన్న భావన పెట్టుబడిదారుల్లో కల్పించేలా సమ్మిట్ నిర్వహణ
ఇప్పటికే 14 కంపెనీలు.. లక్ష కోట్ల పెట్టుబడులపై అవగాహన
తాజాగా మరో 36 సంస్థలతో చర్చలు కొలిక్కి
మొత్తంగా రూ.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేరే చాన్స్
భూ కేటాయింపులపై మాత్రం డీపీఆర్ ఇచ్చాకే నిర్ణయం
ఒప్పందాల పూర్తి అనంతరం ఫోర్త్ సిటీ పరుగులు
వెల్లువెత్తనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు!
సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం
ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి
కార్బన్ క్రెడిట్ వ్యాపారానికి ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాల విలువ రూ.3లక్షల కోట్లకు చేరింది. సుమారు 50 ప్రతిష్ఠాత్మక సంస్థలు, పలురంగాల్లో ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా వెలువడనున్నాయి. రైజింగ్ సమ్మిట్‌ను ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం ఉన్న అపారమైన అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించేందుకు.. భవిష్యత్తు అభివృద్ధి, సంక్షేమ ప్రణాళిక విజన్ 2047ను ఆవిష్కరించే లక్ష్యాలతో ఏర్పాటుచేశారు. ఒకసారి ఇక్కడున్న అవకాశాలను చూశాక ఈ రోజు కాకున్నా భవిష్యత్తులోనైనా పెట్టుబడిదారులు వస్తారన్న భరోసాతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికిప్పుడు పెట్టుబడి ఒప్పందాలపై పెద్దగా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతామన్న భావన పెట్టుబడిదారుల్లో కల్పించేలా మాత్రం సమ్మిట్ నిర్వహించాలన్నదే ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కూడా అనేక కంపెనీలు, సంస్థలు, పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులకు సంబంధించిన చర్చలు జరిగాయి. ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తొలుత 14 కంపెనీలకు సంబంధించిన చర్చలు.. అవి పెట్టే పెట్టుబడులకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చారు. ఇదే సుమారు రూ.లక్ష కోట్లు అయింది. ఆ తర్వాత మరో 36 కంపెనీలకు సంబంధించిన చర్చలను కూడా దాదాపుగా ఒక కొలిక్కి తెచ్చారు. వాటి ప్రతిపాదిత పెట్టుబడులను కూడా చేరిస్తే మొత్తంగా 3లక్షల కోట్ల వరకు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులు తెలిపారు. టీసీఎ్‌స-టీజీపీ హైపర్‌వాల్ట్ డేటా కేంద్రాలు, రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన వంతారా వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ ప్రాజెక్టు, అజయ్‌దేవగన్ ఫిల్మ్ స్టూడియో, విన్‌గ్రూ్‌ప (వియత్నాం) సమీకృత పారిశ్రామిక పార్కు, సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ సంస్థ పారిశ్రామిక పార్కు.. ఇలా అనేక సంస్థలు రాష్ట్రంలో తాము పెట్టనున్న పెట్టుబడులపై ప్రకటన చేయనున్నాయి.
వంతారాకు 200ఎకరాలు... సెంబ్‌కార్ప్‌కు 1000 ఎకరాలు
రిలయన్స్ సంస్థకు చెందిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 200ఎకరాలను ఫోర్త్‌సిటీలోని ముచ్చర్లలో కేటాయించనున్నారు. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వస్తే వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, అనుబంద ఉద్యోగులకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ సంస్థ తమకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని కోరింది. ఈ వెయ్యి ఎకరాల్లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టే బాధ్యత తీసుకుంటామని ప్రతిపాదించింది. వియత్నాంకు చెందిన విన్‌గ్రూ్‌ప కూడా తామే ఒక సమీకృత పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేసి అందులో తమ కంపెనీతో పాటు ఇతర సంస్థలు, అనుబంధ సంస్థలను కూడా తీసుకొస్తామని చెప్పింది. ఇతర కంపెనీలు కూడా తమకు ఎంతెంత భూమి కావాలని ప్రాథమికంగా ప్రభుత్వాన్ని అడిగాయి.
డీపీఆర్ తర్వాతే భూ కేటాయింపులు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎవరికీ భూ కేటాయింపులపై స్పష్టంగా చెప్పడం లేదు. ఆయా కంపెనీలు తామేం చేయదల్చుకున్నాం అన్నదానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇచ్చిన తర్వాతే.. దాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాకే కేటాయింపులు చేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏ కంపెనీల ఆర్థికస్థితిగతులేమిటి? అవి కల్పించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలేమిటి? ఆ కంపెనీల అడుగుతున్న భూమి ఎంత? అంత భూమి వాస్తవంగా అవసరమా? అన్న వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు.
లక్షల్లో ఉద్యోగాలు... ఆ లెక్క తేలేది డీపీఆర్ వచ్చాకే
మరోవైపు రైజింగ్ సమ్మిట్‌లో ప్రకటించే, అవగాహన ఒప్పందం చేసుకునే పెట్టుబడుల వల్ల పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. లక్షల సంఖ్యలోనే ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని చెబుతోంది. అయితే కచ్చితంగా ఎన్ని అనేది ఆయా కంపెనీలు తమ డీపీఆర్‌లు సమర్పించినప్పుడే కచ్చితంగా తెలుస్తుందని ఒక అధికారి తెలిపారు.
భూకేటాయింపులు పూర్తయ్యాక పనుల్లో వేగం
రైజింగ్ సమ్మిట్ సందర్భంగా చేసుకుంటున్న ఎంవోయూలు, ప్రకటనలు కార్యరూపం దాలిస్తే.. ఇప్పటికి ఫోర్త్‌సిటీలో ఉన్న 13,500ఎకరాల భూమిలో చాలాభాగం కేటాయింపులు చేయాల్సి వస్తోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డీపీఆర్‌ల పరిశీలన.. అనంతరం భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు ఆరునెలల సమయం పట్టొచ్చునని అంచనా వేస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఒక ఏడాదిలో ఈ కంపెనీలకు, అదే సమయంలో భవిష్యత్తులో వచ్చే మరిన్ని కంపెనీలకు కూడా భూ కేటాయింపులు పూర్తయితే.. ఫోర్త్‌సిటీలో పనులు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వం చెప్తోంది. ఏడాది తర్వాత అక్కడ భవిష్యత్తు నగరం రూపుదిద్దుకునే ప్రక్రియ వేగంగా నడుస్తుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం అక్కడ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్కిల్ వర్సిటీ నిర్మాణ పనులు, ఫోర్త్‌సిటీ కమిషనరేట్ కార్యాలయం పనులు జరుగుతున్నాయి. ఓర్‌ఆర్‌ఆర్‌నుంచి ఫోర్త్‌సిటీ వరకు వేస్తున్న 330అడుగుల వెడల్పు ఉన్న రహదారికి పనులు ప్రారంభమయ్యాయి. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13....రావిర్యాల నుంచి ఫోర్త్ సిటీ వరకు 42 కి.మీ మేర వేయనున్న ఈ రోడ్డు పనులు వేగంగానే సాగుతున్నాయి. మరోవైపు ఫోర్త్‌సిటీలో అంతర్గతంగా వేయాల్సిన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన కూడా ఏడాదిలోపు పూర్తవుతుందని, అప్పటికి కంపెనీలకు భూములు కూడా కేటాయింపు పూర్తయితే పనులు ముందుకు సాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.